టీఎస్‌ఆర్టీసీకి దినదిన గండం

September 24, 2020


img

మహాభారతంలో కర్ణుడి చావుకు వేయి కారణాలన్నట్లు టీఎస్‌ఆర్టీసీ కష్టాలు, నష్టాలకు కూడా అన్నే కారణాలు కనిపిస్తున్నాయి. ఎప్పుడూ నష్టాలలో నడిచే టీఎస్‌ఆర్టీసీ 55 రోజుల ఆర్టీసీ కార్మికుల సమ్మెతో మరింత మునిగింది. లాభదాయకం కాదంటూ హైదరాబాద్‌లో 1,200 సిటీ బస్ సర్వీసులను ప్రభుత్వం రద్దు చేయడంతో మరింత ఆదాయం కోల్పోయింది. ఆ వరుస షాకుల నుంచి తేరుకొనేలోగా కరోనా వచ్చిపడింది. మొత్తం అన్ని బస్సులు నడిస్తేనే ఎప్పుడూ నష్టాలలో మునిగితేలే టీఎస్‌ఆర్టీసీకి లాక్‌డౌన్‌ కారణంగా 6 నెలలు బస్సులన్నీ డిపోలకే పరిమితం కావడంతో కోలుకోలేనంత పెద్ద దెబ్బ తగిలింది. 

బస్సులు నడుపుతుంటేనే నెలనెలా ఆర్టీసీ కార్మికులకు జీతాలు చెల్లించడానికి తడుముకొనే టీఎస్‌ఆర్టీసీకి, ఏమక్ఙ్గా ఆరునెలలు ఒక్క బస్సు కూడా నడిపించకుండా కార్మికులందరికీ జీతాలు చెల్లించడమంటే ఎంత కష్టమో ఊహించుకోవచ్చు. ఆర్టీసీ సమ్మె ముగిసిన తరువాత ఆర్టీసీని, కార్మికులను కాపాడుకొంటామని చెప్పిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో టీఎస్‌ఆర్టీసీ ఈ ఏడాది మార్చిలో బ్యాంకుల నుంచి రూ.600 కోట్లు అప్పులు తీసుకువచ్చి దాంతో కార్మికులకు జీతాలు చెల్లిస్తోంది. ఇప్పుడు అది కూడా అయిపోవడంతో ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శిని కలిసి ఆర్టీసీ కార్మికులకు జీతాలు చెల్లించేందుకు డబ్బు సర్దుబాటు చేయవలసిందిగా కోరారు కానీ ఫలితం లేదు. 

అక్టోబర్ 1వ తేదీన ఆర్టీసీ కార్మికులకు జీతాలు చెల్లించవలసి ఉంది. బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులకు వడ్డీలు కూడా చెల్లించాల్సి ఉంది. ఆర్టీసీకి అద్దె బస్సులు నడిపించిన ప్రైవేట్ బస్సుల యజమానులకు గత మూడు నెలలుగా బకాయిలు చెల్లించకపోవడంతో వారందరూ మూడు రోజుల క్రితం బస్ భవన్‌ను ముట్టడించి ధర్నా చేశారు. తక్షణమే తమ బకాయిలు చెల్లించకపోతే హైకోర్టుకు వెళతామని హెచ్చరించారు. 

ఇవికాక గతంలో ఆర్టీసీ కార్మికుల సహకార పొదుపు సంఘం నుంచి టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం యధేచ్చగా డబ్బు వాడుకొంది. దానిపై ఆర్టీసీ సమ్మె సమయంలోనే హైకోర్టులో విచారణ జరిగింది. అప్పుడే హైకోర్టు టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యానికి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఆ కేసుపై అక్టోబర్ 5వ తేదీన మళ్ళీ హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఆరోజున ఆ సొమ్ము తిరిగి చెల్లింపు గురించి టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం హైకోర్టు జవాబు చెప్పవలసి ఉంటుంది. 

టీఎస్‌ఆర్టీసీ గుదిబండగా మారడంతో ప్రభుత్వం కూడా చేతులెత్తేస్తోంది. టీఎస్‌ఆర్టీసీని ఒకేసారి ఇన్ని సమస్యలు చుట్టుముట్టడంతో ప్రత్యామ్నాయమార్గాల కోసం ఆన్వేషిస్తోంది. 

అయితే ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయని టీఎస్‌ఆర్టీసీకి ముందే తెలుసు కనుక లాక్‌డౌన్‌ సమయంలోనే ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచించి ఉండి ఉంటే నేడు ఈ దుస్థితి ఎదురయ్యేది కాదేమో? కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకొన్నట్లు ఇప్పుడు ఒకేసారి ఇన్ని సమస్యలు వచ్చి మీద పడటంతో మేల్కొని నిన్న హడావుడిగా నగర శివారు ప్రాంతాలలో డిపోల నుంచి సిటీ బస్సులను తిప్పడం ప్రారంభించింది. కానీ కరోనా భయంతో ఇదివరకులా ప్రజలు సిటీ బస్సులు ఎక్కుతారనే నమ్మకం లేదు. కనుక వాటిద్వారా భారీగా ఆదాయం ఆశించడం అత్యాశే అవుతుంది. కనుక టీఎస్‌ఆర్టీసీని కాపాడుకోవాలనుకొంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా సహాయం చేయాల్సి ఉంటుంది. అలాగే టీఎస్‌ఆర్టీసీ కూడా వీలైనంత త్వరగా ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను ఆన్వేషించాల్సి ఉంటుంది.     



Related Post