ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో నిర్మించిన రాజీవ్ స్వగృహ ఇళ్ళను యదాతదస్థితిలో అమ్మేసి రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌ను ఆర్ధికసమస్యల నుంచి విముక్తి కల్పించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబందించి విధివిధానాలను రూపొందించేందుకు రాష్ట్ర గృహనిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శి చిత్రారామచంద్రన్ అధ్యక్షతన ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్ సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మద్యతరగతి ప్రజలకు ఇళ్ళు అందజేయాలనే ఓ మంచి లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఏర్పాటయింది. అది రూ.8,504 కోట్లు వ్యయంతో ఏపీ, తెలంగాణలో మొత్తం 32 ప్రాజెక్టులు మొదలుపెట్టింది. వాటిలో తెలంగాణలో రూ.6,301 కోట్లు వ్యయంతో 20 ప్రాజెక్టులు మొదలుపెట్టింది. ఈ ప్రాజెక్టుల కోసం అప్పటి ప్రభుత్వం తెలంగాణలో 784 ఎకరాల భూమిని తాకట్టు పెట్టి రూ.1,000 కోట్లు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొంది. కానీ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ విధానపరమైన లోపాలు ఇంకా అనేక ఇతర కారణాల చేత తీవ్ర ఆర్ధిక సమస్యలలో చిక్కుకుపోయింది. దాంతో 2011లో ఇళ్ళ నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయాయి.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే బ్యాంకులకు రూ. 1,000 కోట్లు బకాయిలు చెల్లించేసి గత ప్రభుత్వం తాకట్టు పెట్టిన ప్రభుత్వ భూములను విడిపించుకొంది. కానీ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ పరిస్థితిలో మార్పు రాలేదు. కనుక రాష్ట్రంలో అది మొదలుపెట్టిన ఇళ్ళ నిర్మాణాలను కూడా పూర్తిచేయలేకపోయింది. ఆ కారణంగా రాజీవ్ స్వగృహ ఇళ్ళ కోసం డబ్బు చెల్లించిన మద్యతరగతి ప్రజలు కూడా ఆర్ధిక సమస్యలలో చిక్కుకున్నారు. కనుక 80 శాతం పూర్తయిన ఇళ్ళను యదాతద స్థితిలో అమ్మివేయాలని నిర్ణయించి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ పధకంలో ఇళ్ళు కొనుగోలు చేసేందుకు గతంలో డబ్బు చెల్లించినవారికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. వారి తరువాత ఎవరైనా ఈ ఇళ్ళు కొనుగోలు చేసుకొనేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత భూమి ధరలు, ఇళ్ళ వాస్తవ పరిస్థితులు ఆధారంగా ఇళ్ళ ధరలు నిర్ణయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్రిసభ్య కమిటీ అన్ని అంశాలపై లోతుగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. దానిని సిఎం కేసీఆర్ పరిశీలించి ఆమోదముద్ర వేసిన తరువాత రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఇళ్ళు అమ్మకాలు ప్రారంభిస్తుంది.