రేవంత్‌ రెడ్డి పోరాటం ఆయన వ్యక్తిగతం: జగ్గారెడ్డి

March 10, 2020


img

రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీని ఒక్కటిగా చూస్తే చాలా బలంగానే కనిపిస్తుంది. ఎందుకంటే దానిలో అనేకమంది హేమాహేమీలైన నేతలున్నారు. కానీ వారి మద్య సమన్వయం, పరస్పర సంబందాలు లేకపోవడం రాష్ట్ర కాంగ్రెస్‌ బలహీనత.

ఫిరాయింపుల కారణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనపడింది. అయినా కాంగ్రెస్‌ నేతలు తమ బలహీనతను జయించలేకపోతున్నారు. అందుకు తాజా ఉదాహరణగా సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గురించి చెప్పుకోవచ్చు. 

ఆయన మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్‌ పార్టీలో నాలాగ కష్టపడి పనిచేసేవారికి, ప్రజలలో మంచి గుర్తింపు ఉన్నవారికీ విలువలేదు. డిల్లీలో లాబీయింగ్ చేసుకోగలవారి మాటే చెలామణి అవుతుంటుంది. డిల్లీలో సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలను కలవాలనుకుంటే ద్వారపాలకుల వంటి ఈ లాబీయిస్టులు అడ్డుపడుతుంటారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వాళ్ళే మొనగాళ్ళు కనుక పిసిసి అధ్యక్ష పదవి కోసం ఎవరికి వారు డిల్లీలో లాబీయింగ్ చేసుకొంటున్నారు,” అని అన్నారు. 

కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంపై జగ్గారెడ్డి భిన్నంగా స్పందించారు. “అది ఆయన వ్యక్తిగత పోరాటమే తప్ప పార్టీ పోరాటం కాదు. అయినా జీవో నెంబర్: 111 పై పోరాటం మొదలుపెట్టే ముందు ఆయన దాని గురించి పార్టీలో ఎవరితోనూ చర్చించలేదు. ఎవరి అనుమతి తీసుకోలేదు. కనుక ఆయన పోరాటం, అరెస్టుతో పార్టీకి ఎటువంటి సంబందమూ లేదని నేను భావిస్తున్నాను. మాలో మాకు ఎన్ని గొడవలున్నా శత్రువులతో పోరాడేటప్పుడు అందరూ ఒక్కటవుతాము,” అని అన్నారు.

పిసిసి అధ్యక్ష పదవి ఆశిస్తున్న జగ్గారెడ్డి, తనకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే పార్టీలో నేతలందరినీ కలుపుకుపోతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేగలనని చెపుతున్నారు. కానీ సాటి కాంగ్రెస్‌ నేతను జైలులో పెడితే జగ్గారెడ్డి ఈవిధంగా మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. 


Related Post