కాంగ్రెస్ పార్టీకి జ్యోతిరాధిత్య సింధియా గుడ్ బై

March 10, 2020


img

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జ్యోతిరాధిత్య సింధియా మంగళవారం ఉదయం ప్రధాని నరేంద్రమోడీని కలిసిన తరువాత పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వెంటనే పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాజీనామా లేఖను పంపించారు. గత 18 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశానని, కానీ రాష్ట్రానికి దేశానికి సేవలందించాలనే తన కోరిక నెరవేరకపోవడంతో పార్టీని వీడుతున్నానని లేఖలో పేర్కొన్నారు. సోనియాగాంధీతో సహా ఇంతకాలం పార్టీలో తనకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ జ్యోతిరాధిత్య సింధియా కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

2018లో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చినప్పుడు జ్యోతిరాధిత్య సింధియా ముఖ్యమంత్రి పదవి ఆశించారు. కానీ కాంగ్రెస్‌ అధిష్టానం సీనియర్ నేత కమల్‌ నాథ్ కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడంతో సింధియా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 

ముఖ్యమంత్రి అవ్వాలనే ఆయన కోరికను, ఆయన అసంతృప్తిని గమనించిన బిజెపి మెల్లగా పావులు కదపడం మొదలుపెట్టింది. సింధియా రాజీనామాతో బిజెపి ప్రయత్నాలు ఫలించడంతో ఆయన ద్వారా మధ్యప్రదేశ్‌లో చేజారిపోయిన అధికారాన్ని మళ్ళీ చేజిక్కించుకొనేందుకు బిజెపి సిద్దం అవుతోంది.

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో మొత్తం 230 సీట్లు ఉండగా వాటిలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 228 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి 114, బిజెపి-109, ఎస్పీ-1, బీఎస్పీ-2, స్వతంత్ర ఎమ్మెల్యేలు-4 ఉన్నారు. సింధియాతో పాటు మొత్తం 19 మంది ఎమ్మెల్యేలు కూడా మంగళవారం పార్టీకి రాజీనామాలు చేశారు. దాంతో శాసనసభలో కాంగ్రెస్‌ ప్రభుత్వ బలం 95కు పడిపోయింది. వారందరూ సింధియా నేతృత్వంలో బిజెపిలో చేరడానికి సిద్దం అవుతున్నారు కనుక శాసనసభలో బిజెపి బలం 128కి పెరుగుతుంది. ప్రభుత్వం నిలబడటానికి లేదా ఏర్పాటుకు కనీసం 115 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అంటే కమల్‌నాధ్ ప్రభుత్వం కూలిపోయి, మళ్ళీ కమలం (బిజెపి) వికసించనుందన్నమాట! ముఖ్యమంత్రి పదవి కోసమే సింధియా బిజెపిలో చేరేందుకు సిద్దమవుతున్నారు కనుక త్వరలో ఆయనే మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమనే భావించవచ్చు.


Related Post