క్లైమాక్సులో ఆస్తుల గొడవ

March 09, 2020


img

ప్రణయ్ అమృత ప్రేమకధ పరువుహత్యతో ముగిసిందనుకుంటే, ఆ హత్యకేసులో నిందితుడిగా ఉన్న అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకొన్నారు. కనుక ఇక్కడితో ఈ సమస్య సర్దుమణుగుతుందనుకుంటే అనూహ్యంగా కధ మరో మలుపు తిరిగింది. తండ్రి ఆస్తిపై బాబాయ్ శ్రవణ్ కన్నేశాడని బాబాయ్ వలన తన తల్లి ప్రాణాలకు ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేసింది. ఆస్తుల కోసం బాబాయ్ తన తండ్రిని వేధించేవాడని బహుశః ఆ ఒత్తిడి తట్టుకోలేకనే తన తండ్రి ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని అమృత అనుమానం వ్యక్తం చేసింది. బాబాయ్ శ్రవణ్ తన తండ్రిని రెచ్చగొట్టి తన భర్త ప్రణయ్‌ను హత్య చేయించాడని అమృత ఆరోపించింది. తండ్రి ఆస్తులు తనకు అవసరం లేదని కావాలంటే తల్లిని తానే చూసుకొంటానని అమృత చెప్పింది. 

అమృత చేసిన ఆరోపణలపై శ్రవణ్ స్పందిస్తూ, “ ఇంతకాలం తన తండ్రిని ఉరి తీయాలి..మారుతీరావును నా తండ్రిగా చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను,” అంటూ మాట్లాడిన అమృత ఇప్పుడు తండ్రి చనిపోగానే మాటమార్చి తల్లిపై కపటప్రేమ ఒలకబోస్తోంది. తండ్రి ఆస్తిని చేజిక్కించుకోవడం కోసమే ఆమె ఈ కొత్త నాటకం మొదలుపెట్టింది. అంతగా ప్రేమించే గొప్ప తండ్రిని కోల్పోవడం ఆమె దురదృష్టం అనుకోవాలి కానీ తండ్రి చనిపోతే ‘శుభవార్త’ అని అమృత అందంటే ఏమనుకోవాలి? మా అన్న పోయినప్పుడు ఒక్క పైసా వెంటతీసుకుపోలేదు...రేపు నేను పోయినా అంతే. కనుక మా అన్న ఆస్తిలో నాకు చిల్లీ గవ్వ కూడా అవసరం లేదు. అన్నయ్యను నేను బెదిరిస్తున్నానని అమృత ఆరోపించడం నాకు చాలా బాధ కలిగించింది. నేను బెదిరింపులకు పాల్పడుతుండటం నిజమైతే మరి ఇంతకాలం నాపై ఎవరూ ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ప్రణయ్ కేసుతో నాకు సంబందమే లేదు. చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నాను. అమృత వల్లనే ఇదంతా జరిగింది,” అని అన్నారు. 

మొదట ఓ అందమైన ప్రేమకధ..దానిలో తండ్రి విలన్.. ప్రేమికుడి హత్య..విలన్ ఆత్మహత్యతో కధ ముగిసిందనుకుంటే, ఇప్పుడు మళ్ళీ ఈ ఆస్తుల గొడవలతో కధ మళ్ళీ మొదలైంది. కానీ గమ్మతైన విషయం ఏమిటంటే వారిద్దరూ తమకు మారుతీరావు ఆస్తులు అక్కరలేదని చెపుతుండటం!ఒకవేళ వారిద్దరూ నిజంగా ఆ ఆస్తులు వద్దనుకుంటే ఇక్కడితో ఈ కధ ముగుస్తుంది కానీ ఇద్దరూ కావాలనుకొంటే మాత్రం ఇంకా అనేక అనూహ్యపరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ హత్య, కోర్టు కేసులు, ఆత్మహత్యల వలన ఇప్పటికే మూడు కుటుంబాలు చాలా చితికిపోయాయి. మానసికంగా నరకం అనుభవిస్తున్నాయి. కనుక ఇంకా ఈ ఊబిలో కూరుకుపోకుండా అందరూ వివేకంతో వ్యవహరించడం చాలా అవసరం.


Related Post