కేసీఆర్‌కు మద్దతు ఇస్తాం: ఉత్తమ్‌కుమార్ రెడ్డి

March 09, 2020


img

రాష్ట్రంలో టిఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీలు రాజకీయంగా పరస్పరం శత్రువులుగా భావిస్తుంటాయి. ముఖ్యంగా ఫిరాయింపులతో కాంగ్రెస్ పార్టీని కోలుకోలేనివిధంగా దెబ్బతీసిన టిఆర్ఎస్‌కు.. దాని అధినేత సిఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ ఏవిషయంలోనూ సహకరిస్తుందనుకోలేము. కానీ ఒక్క విషయంలో కేసీఆర్‌ ప్రభుత్వానికి సహకరించేందుకు  సిద్దంగా ఉన్నామని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సిఎం కేసీఆర్‌కు ఓ బహిరంగలేఖ వ్రాశారు.

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్నార్సీ, ఎన్‌పీఆర్‌లను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది కనుక రాష్ట్రంలో వాటిని అమలుచేయకూడదని కేసీఆర్‌ ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసినట్లయితే, దానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమద్దతు ఇస్తుందని లేఖ ద్వారా తెలిపారు. వివాదాస్పద ఈ మూడు ప్రతిపాదనల వలన దేశంలో మతపరమైన వివక్ష, విభేధాలు ఏర్పడుతాయనే ఉద్దేశ్యంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని వ్యతిరేకించాయని కనుక తెలంగాణ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో వాటిని అమలుచేయకుండా అడ్డుకొనేందుకు తీర్మానం చేయాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి లేఖలో సిఎం కేసీఆర్‌ను కోరారు. ఈ మూడు ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ కేరళ ప్రభుత్వం గత ఏడాది డిసెంబరులో జారీ చేసిన జీవో కాపీని ఉత్తమ్‌కుమార్ రెడ్డి లేఖతోపాటు జత చేసి సిఎం కేసీఆర్‌కు పంపించారు. 

 సీఏఏను వ్యతిరేకిస్తున్నట్లు సిఎం కేసీఆర్‌ నిర్ద్వందంగానే చెపుతున్నారు. దానిని వ్యతిరేకిస్తూ శాసనసభలో తీర్మానం చేస్తామని కూడా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వాటిని వ్యతిరేకిస్తోంది కనుక శాసనసభ ఆ తీర్మానానికి మద్దతు ఇవ్వడం పెద్ద విశేషం కాదు. కానీ సీఏఏ విషయంలో తప్పటడుగులు వేస్తే ఏమవుతుందో డిల్లీలో జరిగిన విధ్వంసం...మతఘర్షణలు...దారుణహత్యలు అందరూ చూశారు. హైదరాబాద్‌లో కూడా అటువంటి ప్రమాదం పొంచి ఉందనే సంగతి అందరికీ తెలుసు. అయితే కనుక దేశంలో అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌ నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రంలో...ముఖ్యంగా హైదరాబాద్‌లో అటువంటి సమస్యలనుసిఎం కేసీఆర్‌ చేజెతులా ఆహ్వానిస్తారనుకోలేము. కనుక వివాదాస్పదమైన ఈ మూడు ప్రతిపాదనలపట్ల ఆయన చాలా ఆచితూచి అడుగు ముందుకు వేస్తారని వేరే చెప్పక్కరలేదు.

ముస్లిం రిజర్వేషన్లపై ఆయన ఈవిధంగా వ్యవహరించారో వీటిపై కూడా అదేవిధంగా శాసనసభలో ఓ తీర్మానం చేసి 'సీఏఏ బంతిని' కేంద్రం కోర్టులో పడేయవచ్చు. తద్వారా సీఏఏను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు గట్టిగా చెపుతూనే రాష్ట్రంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడవచ్చు. కనుక శాసనసభలో ఆ తీర్మానానికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా తేడా ఉండకపోవచ్చు.


Related Post