మారుతీరావు ఆత్మహత్య

March 08, 2020


img

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న మారుతీరావు ఖైరతాబాద్‌ వద్ద గల ఆర్యవైశ్యభవన్‌లో శనివారం రాత్రి విషం త్రాగి ఆత్మహత్య చేసుకున్నారు. సూసైడ్ నోట్‌లో గిరిజ (భార్య) క్షమించు.. తల్లీ అమృత అమ్మ దగ్గరకి వెళ్లిపో..” అని వ్రాసినట్లు తెలుస్తోంది. ఖైరతాబాద్‌ పోలీసులు మారుతీరావు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం గదిలో లభించిన విషం సీసా, సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.   

నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన మారుతీరావు దంపతుల ఏకైక కుమార్తె అమృత, తల్లితండ్రుల అభీష్టానికి విరుద్దంగా వేరే కులానికి చెందిన ప్రణయ్‌ను వివాహం చేసుకొంది. అది జీర్ణించుకోలేక మారుతీరావు కిరాయి హంతకుడితో 2018 సెప్టెంబర్‌ 14న అల్లుడు ప్రణయ్‌ను హత్య చేయించారు. ఆరు నెలల క్రితం బెయిల్‌పై బయటకు వచ్చిన ఆయన కూతురిని తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పమని మద్యవర్తి ద్వారా కోరగా ఆమె అందుకు నిరాకరించడమే కాక మద్యవర్తిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ప్రణయ్ కేసులో సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారనే మరో నేరం మారుతీరావుపై మోపబడింది. ప్రణయ్ హత్య కేసు విచారణ దాదాపు పూర్తి కావస్తున్నా దాని నుంచి బయటపడే అవకాశం లేదని భావించిన మారుతీరావు, ఇటీవలే తన ఆస్తులన్నిటినీ భార్య గిరిజ పేరిట బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసు విషయంలో లాయరుతో మాట్లాడేందుకు వెళ్తున్నానని చెప్పి హైదరాబాద్‌ చేరుకొన్న మారుతీరావు ఆర్యవైశ్యభవన్‌లో తన గదిలో శనివారం రాత్రి విషం త్రాగి ఆత్మహత్య చేసుకున్నారు.  

తండ్రి ఆత్మహత్య చేసుకోవడంపై అమృత స్పందిస్తూ, “నేను కూడా టీవీలో చూసి ఈవిషయం తెలుసుకున్నాను. బహుశః అల్లుడిని చంపినందుకు పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకొని ఉంటారని భావిస్తున్నాను,” అని అన్నారు.


Related Post