శాసనసభలో కాంగ్రెస్‌ ఉండకూడదని ఎవరు కోరుకొంటున్నారు?

March 07, 2020


img

ఈరోజు శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో సిఎం కేసీఆర్‌ మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడ్డుతగులుతూ ఎన్నికల హామీలను ఇంకా ఎప్పుడు అమలుచేస్తారంటూ నిలదీయడంతో సిఎం కేసీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

“సభలో ఎవరికివారు ఇష్టం వచ్చినట్లు అరుస్తాము... ప్రవర్తిస్తామంటే కుదరదు. సభలో పద్దతిగా వ్యవహరించవలసిందే. సభలో అరాచకం సృష్టించాలనుకొంటే సహించబోము. శాసనసభ చర్చలో పాల్గొనేందుకు భయపడి కాంగ్రెస్‌ సభ్యులు ఏదో ఓ గొడవ చేసి బయటకు వెళ్లిపోవాలని యోచిస్తున్నట్లున్నారు. సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్న వారిపై చర్యలు తీసుకోవలసిందిగా శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డిని కోరుతున్నాను,” అని అన్నారు.

మంత్రి ప్రశాంత్ రెడ్డి సూచన మేరకు ఆరుగురు కాంగ్రెస్‌ సభ్యులను స్పీకరు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒక్క రోజు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. తమను సభ నుంచి బహిష్కరించడంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు స్పందిస్తూ శాసనసభలో ప్రశ్నించే గొంతులు, ప్రతిపక్షాలు ఉండకూడదనే దురుదెశ్యంతోనే మమ్మల్ని బయటకు పంపించేస్తున్నారు,” అని ఆరోపించారు. 

ఇంతకీ శాసనసభ సమావేశాలలో ఉండకూడదని కాంగ్రెస్‌ సభ్యులే కోరుకొన్నారా లేదా సిఎం కేసీఆర్‌ కోరుకొన్నారా? అనే ప్రశ్నకు ఎవరికి తోచినట్లు వారు సమాధానం చెప్పుకోవచ్చు.


Related Post