సీఏఏపై చర్చిద్దాం..వ్యతిరేకిస్తూ తీర్మానిద్దాం: కేసీఆర్‌

March 07, 2020


img

తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలలో రెండోరోజైన శనివారం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ నడుస్తోంది. ఆ చర్చలో మాట్లాడిన సిఎం కేసీఆర్‌ సీఏఏపై ప్రభుత్వ వైఖరిని మళ్ళీ పునరుద్ఘాటించారు. 

“సీఏఏను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. డిల్లీలో జరిగిన అల్లర్లలో అనేకమంది చనిపోయారు. ఆ కారణంగా ప్రపంచదేశాలలో భారతదేశం ప్రతిష్టకు భంగం కలుగుతోంది. కనుక దీనిపై లోతుగా చర్చించి దాని మంచిచెడ్డలను ప్రజల ముందు ఉంచవలసిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజమే. కనుక దీనిపై సభలోని బిజెపి సభ్యుడు రాజాసింగ్‌తో సహా అందరూ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా తెలియజేయవచ్చు. ఈ చర్చల సారాంశం ఆధారంగా మనం ఓ తీర్మానాన్ని ఆమోదించి కేంద్రప్రభుత్వానికి పంపిద్దాం. దానిని కేంద్రప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా అనే విషయం తరువాత ఆలోచిద్దాం,” అని అన్నారు. 

సీఏఏను టిఆర్ఎస్‌ పార్లమెంటులోనే వ్యతిరేకించింది. కానీ మునిసిపల్ ఎన్నికలలో ఎక్కడా ఆ ప్రస్తావన చేయకుండా ముగించింది. కానీ ఫలితాలు వెలువడగానే సిఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి సీఏఏపై తమ పార్టీ వైఖరిని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం విశేషం. 

సీఏఏను వ్యతిరేకిస్తున్నట్లు సిఎం కేసీఆర్‌ చెప్పినప్పటికీ, రాష్ట్రంలో టిఆర్ఎస్‌ శ్రేణులు ఎక్కడా, ఎన్నడూ సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టలేదు. అలాగే సీఏఏకు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్‌ ఉద్యమించబోతే పోలీసులు అనుమతించలేదు. కానీ దీనిపై మజ్లీస్ పార్టీ చేపట్టిన ఆందోళనలను అనుమతీస్తున్నారు.  

ఒకే అంశంపై ఇంత భిన్నంగా వ్యవహరిస్తున్న సిఎం కేసీఆర్‌, నేడు శాసనసభలో సీఏఏపై చర్చ జరగాలని కోరడం హర్షణీయమే. కానీ సీఏఏను వ్యతిరేకించాలన్నట్లు ముందే మాట్లాడి దానిపై లోతుగా చర్చించాలని చెప్పడం వలన ఏమి ప్రయోజనం? ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనలకు భిన్నంగా సీఏఏను వ్యతిరేకిస్తూ టిఆర్ఎస్‌ శాసనసభ్యులెవరూ మాట్లాడలేరు.

మజ్లీస్,కాంగ్రెస్ సభ్యులు ఎలాగూ సీఏఏను వ్యతిరేకిస్తూనే మాట్లాడుతారు. కనుక శాసనసభలో ఉన్న ఏకైక బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రమే దానికి అనుకూలంగా మాట్లాడుతారు. సభలో 118 మంది సభ్యులు సీఏఏను వ్యతిరేకిస్తూ, ఒకే ఒక ఎమ్మెల్యే సమర్ధిస్తూ చేసే చర్చలతో దానిలో మంచిచెడులు బయటకువచ్చే అవకాశమే ఉండదని వేరే చెప్పక్కరలేదు. కనుక శాసనసభలో దీనిపై జరుగబోయే చర్చ కేవలం ప్రభుత్వ వైఖరికి ప్రజాస్వామ్యబద్దంగా శాసనసభ చేత ఆమోదముద్ర వేయించుకోవడానికే అన్నట్లవుతుంది అంతే!

ఏది ఏమైనప్పటికీ, శాసనసభ సమావేశాలలో రెండవరోజునే సీఏఏ పట్ల సిఎం కేసీఆర్‌ తన ప్రభుత్వ వైఖరిని పునరుద్ఘాటించి దానిపై వెంటనే చర్చ మొదలుపెట్టాలనుకోవడం ఆలోచించవలసిన విషయమే. ఎందుకంటే, ఆయన తదుపరి రాజకీయ కార్యాచరణ దీనిపైనే ఆధారపడి ఉంటుంది గనుక. 


Related Post