జయప్రదకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ

March 07, 2020


img

ప్రముఖ నటి, బిజెపి సీనియర్ నేత జయప్రదకు నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్ వారెంట్‌ జారీ అయ్యింది. 2019 సార్వత్రిక ఎన్నికలలో బిజెపి తరపున యూపీలోని రాంపూర్ నుంచి పోటీ చేసినప్పుడు ఆమె ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఆమెపై కేసు నమోదు అయ్యింది. ఆ కేసులోనే న్యాయస్థానం పంపిన నోటీసులకు ఆమె సకాలంలో స్పందించకపోవడంతో రాంపూర్ కోర్టు ఆమెకు శనివారం నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్ వారెంట్‌ జారీ చేసింది. వచ్చే నెల 20వ తేదీన ఆమెను కోర్టులో హాజరుపరచవలసిందిగా రాంపూర్ పోలీసులను ఆదేశించింది. 

జయప్రద మొదట తెలుగు ఆ తరువాత హిందీ సినీపరిశ్రమలో పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఆ తరువాత సమాజ్‌వాదీ పార్టీలో చేరి రాంపూర్ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచి ఉత్తరాది రాజకీయాలలో కూడా మంచిపేరు తెచ్చుకున్నారు. కానీ ఆ పార్టీలో సీనియర్ నేత ఆజంఖాన్‌తో విభేధాల కారణంగా పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఆమె రాజకీయ జీవితం తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. అప్పుడు ఆమె బిజెపిలో చేరి 2019 సార్వత్రిక ఎన్నికలలో మళ్ళీ రాంపూర్ నుంచి పోటీ చేసి ఆజంఖాన్‌ చేతిలో ఓడిపోయారు. దాంతో ఆమె పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. ఆమె నేటికీ బిజెపిలోనే కొనసాగుతున్నప్పటికీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 


Related Post