జగన్, చంద్రబాబులకు పరీక్షా సమయం

March 07, 2020


img

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఎన్‌.రమేష్ కుమార్ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు, మునిసిపల్ ఎన్నికలకు శనివారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఈనెల 23న మునిసిపల్ ఎన్నికలు నిర్వహించి, ఆ తరువాత రెండు దశలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 

రాష్ట్రంలో మొత్తం 660 జెడ్పీటీసీ, 9,639 ఎంపీటీసీ స్థానాలకు మార్చి 27, 29 తేదీలలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కనుక నేటి నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినట్లు రమేష్‌ కుమార్‌ తెలిపారు. 

మునిసిపల్ ఎన్నికల ఫలితాలు మార్చి 24న, పంచాయతీ ఎన్నికల ఫలితాలు27, 29 తేదీలలో ప్రకటిస్తామని తెలిపారు. 

ఏపీలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేపట్టిన తరువాత తొలిసారిగా జరుగుతున్న ఎన్నికలివి. గత 10 నెలల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేకానేక సంక్షేమ పధకాలు అమలుచేసింది. సుమారు 4.5 లక్షలమందికి పైగా స్థానిక సచివాలయ వ్యవస్థలో ఉద్యోగావకాశాలు కల్పించింది. సుమారు 50,000 మంది ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసుకొని ప్రభుత్వోద్యోగులుగా గుర్తింపు కల్పించింది. ఇవన్నీ జగన్‌ ప్రభుత్వానికి సానుకూల అంశాలు కాగా, గత 10 నెలల్లో జగన్‌ ప్రభుత్వం తీసుకొన్న వివాదాస్పదమైన అనేక నిర్ణయాలు ప్రతికూలాంశాలుగా నిలుస్తున్నాయి. 

పోలవరం రివర్స్ టెండరింగ్, రాజధాని అమరావతి విశాఖకు తరలింపు, విద్యుత్ ఒప్పందాలు పునః సమీక్షించడం, రాష్ట్రం నుంచి పరిశ్రమలు భయపడి పారిపోయే వాతావరణం నెలకొనడం, మాజీ సిఎం చంద్రబాబునాయుడు పట్ల అనుచిత ప్రవర్తన, టిడిపి నేతలపై కేసులు బనాయించడం, వైసీపీ నేతల నోటి దురుసుతనం వంటివి ప్రతికూలాంశాలుగా కనిపిస్తున్నాయి. 

ముఖ్యంగా రాజధాని తరలింపు విషయంలో భిన్నవాదనలు వినిపిస్తున్న వైసీపీ, టిడిపిలకు ఈ ఎన్నికలు రిఫరెండం వంటివేనని చెప్పవచ్చు. ఆ రెండు పార్టీలలో దేని వాదనకు ప్రజలు ఆమోదం తెలుపుతారో ఈ ఎన్నికలలో తెలుస్తుంది. కనుక ఈ ఎన్నికలు అధికార వైసీపీకి అగ్నిపరీక్షగా చెప్పవచ్చు. అసెంబ్లీ ఎన్నికలలో ఘోరపరాజయంతో క్రుంగిపోయిన టిడిపికి ఈ ఎన్నికలు గొప్ప అవకాశంగా అందివచ్చాయని చెప్పవచ్చు. ఒకవేళ ఈ ఎన్నికలలో వైసీపీ గెలిస్తే ఏపీలో టిడిపి ఇక కోలుకోవడం చాలా కష్టమే. ఒకవేళ టిడిపి గెలిస్తే జగన్ ప్రభుత్వ నిర్ణయాల పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నట్లు స్పష్టం అవుతుంది కనుక వైసీపీ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. కనుక ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డికి, మాజీ సిఎం చంద్రబాబు నాయుడుకి ఇది నిజంగానే పరీక్షా సమయమేనని చెప్పవచ్చు.


Related Post