ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేగా...

March 07, 2020


img

రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థలో అప్పుడప్పుడు కొందరు చేసే తప్పులకు యావత్ పోలీస్ శాఖ విమర్శల పాలవుతుంటుంది. అలాగే కొందరు చేసే ఇటువంటి మంచిపనులతో ప్రశంశలు కూడా అందుకొంటుంది. ఇంటర్ పరీక్షలు వ్రాస్తున్న ఆరుగురు విద్యార్దుల సమయస్పూర్తి... వారి సమస్య తీవ్రతను గుర్తించి పోలీస్ అధికారులు    వారికి సహాయపడటం రెండూ అభినందనీయమైనవే. 

లోకేశ్వరం మండలంలో రాయపూర్‌కాండ్లీ, నగర్‌ గ్రామాలకు చెందిన ఆరుగురు విద్యార్దులు మండల కేంద్రంలో ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్నారు. శనివారం ఉదయం వారందరూ తమ గ్రామాలలో ఆర్టీసీ బస్సు కోసం ఎంతసేపు ఎదురుచూసినా రాకపోవడంతో సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోగలమో లేమోనని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అప్పుడు వారికి ఒక ఐడియా వచ్చింది. వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్‌ నెంబర్ 100కు ఫోన్‌ చేసి తమ సమస్యను వివరించారు. కంట్రోల్ సిబ్బంది కూడా సమస్య తీవ్రతను గుర్తించి వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. 

ఆ సమయంలో డ్యూటీలో ఉన్న ఎస్సై యాసిర్ అరాఫత్ కూడా సానుకూలంగా స్పందించి, వెంటనే తన వాహనంలో వారి వద్దకు చేరుకొని వారిని తన కారులో ఎక్కించుకొని పరీక్షా సమయానికి 5 నిమిషాల ముందుగా పరీక్షా కేంద్రం దింపారు. దాంతో ఆరుగురు విద్యార్దులు పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుకొని పరీక్షలకు హాజరయ్యారు. 

విద్యార్దుల సమయస్పూర్తిని, వారి సమస్యను అర్ధం చేసుకొని సహకరించిన పోలీసులను గ్రామస్తులు అభినందించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదే కదా?

కానీ రోజూ పోలీసులు ఈవిధంగా విద్యార్దులకు సహాయపడటం కష్టం కనుక ఆర్టీసీ సంస్థ పరీక్షలు పూర్తయ్యేవరకు సకాలంలో బస్సులు నడిపిస్తే మంచిది.      



Related Post