నిన్న వరంగల్‌.. నేడు ఖమ్మం మిర్చి రైతులు విలవిల

March 06, 2020


img

ప్రభుత్వం.. మార్కెట్ యార్డ్ అధికారులు...వ్యాపారులు ఎవరికీ వారి గోడు పట్టదు. చివరికి ఆ దేవుడికి కూడా వారంటే మంటే! ఎందుకంటే వారు మిర్చి పండిస్తారనేమో? అందుకే ఖమ్మం మార్కెట్ యార్డుకు చేరుకొన్న మిర్చిపై ఈరోజు వరుణదేవుడు తన ప్రతాపం చూపాడు. దాంతో సుమారు 3,000 క్వింటాళ్ళు మిర్చి తడిసిపోయింది. ఖమ్మం నగరంలో శుక్రవారం చాలా భారీగా వర్షం కురిసింది. 

గురువారం సాయంత్రం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో హటాత్తుగా భారీ వర్షం కురిసింది. అక్కడ కూడా చేతికి వచ్చిన మిర్చి పంట తడిసి ముద్దయింది.  

ఈరోజు ఖమ్మంలో కురిసిన భారీ వర్షంతో నగరంలోని ఆర్టీసీ బస్టాండ్, మయూరీ సెంటర్, శుక్రవారిపేట తదితర ప్రాంతాలలో మోకాలు లోతు నీళ్ళు నిండాయి. దాంతో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. 

వర్షం వలన ప్రజలకు ఎదురైన ఈ ఇబ్బంది తాత్కాలికమే కానీ రైతులకొచ్చిన ఈ కష్టం తీరేది కాదు. ఎందుకంటే, అప్పులు చేసి రేయింబవళ్లు కష్టపడి పండించిన నాణ్యమైన మిర్చిని తీసుకువస్తేనే మార్కెట్ యార్డ్ అధికారులు, దళారులు, వ్యాపారులు దానికి అనేక వంకలు పెట్టి ధర తగ్గిస్తుంటారు. ఇక వర్షంలో తడిసిన మిర్చిని కొంటారా?అంటే అనుమానమే. తడిసిన మిర్చిని అమ్ముకోలేక, బయట పారబోయలేక...తిరిగి ఇంటికి తీసుకువెళ్లలేక రైతులు పడే ఆవేదనను ఎవరు మాత్రం తీర్చగలరు? ఏటా రైతులు మార్కెట్ యార్డుల వద్ద ఇవే సమస్యలను ఎదుర్కొంటున్నా పట్టించుకొనే నాధుడులేడు. అన్నదాత...ఆదపడచు కంట కన్నీరు ఎవరికీ మంచిది కాదనే సంగతి పాలకులు ఇంకా ఎప్పుడు గ్రహిస్తారో?


Related Post