గోపనపల్లి భూములు మావే: రేవంత్‌ రెడ్డి

March 05, 2020


img

హైదరాబాద్‌ శివార్లలో శేరిలింగంపల్లి మండలంలోని గోపనపల్లి వివాదాస్పద భూములు తమవేనని, ప్రభుత్వం వాటిని అక్రమంగా లాక్కోవాలని ప్రయత్నిస్తోందంటూ కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి గురువారం హైకోర్టులో పిటిషన్‌ వేశారు. తాము 2005లో చట్టబద్దంగా కొనుగోలు చేసిన ఆ భూములపై ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే వివాదం సృష్టించి, రెవెన్యూ అధికారుల ద్వారా బలవంతంగా లాక్కోవాలని ప్రయత్నిస్తోందని, ఈ వ్యవహారంలో ఇంతవరకు తమకు నోటీసులు ఇవ్వకపోవడమే అందుకు నిదర్శనమని రేవంత్‌ రెడ్డి సోదరులు ఆరోపించారు. కనుక తమ భూములను తమకు ఇప్పించవలసిందిగా రెవెన్యూ అధికారులను ఆదేశించాలని పిటిషన్‌ ద్వారా హైకోర్టును అభ్యర్ధించారు. 

వారి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు, ఈ భూవివాదంపై రెవెన్యూ అధికారులను అడిగి పూర్తివివరాలు తెలుసుకొన్న తరువాత శుక్రవారం దీనిపై విచారణ చేపడతామని తెలియజేసింది. కనుక రేపు విచారణ జరిపేవరకు రెవెన్యూ అధికారులు చట్టప్రకారమే నడుచుకోవాలని ఆదేశించింది. 

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలో గోపనపల్లి గ్రామంలో రూ.150 కోట్లు విలువైన 6 ఎకరాల భూములను రేవంత్‌ రెడ్డి సోదరులు నకిలీ పత్రాలతో తమ పేర్లపైకి బదిలీ చేయించుకున్నారని తెలంగాణ ప్రభుత్వం ఆరోపణ. 

ఈ భూవివాదం మొదలైనప్పుడు రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “నేను 1978లో రికార్డులు తారుమారు చేసి 2005లో ఆ భూములు కొన్నట్లు ప్రభుత్వం నాపై కేసు పెట్టింది. 1978లో నా వయసు 6 సం.లే. ఆ వయసులో నేను ఏవిధంగా ప్రభుత్వ రికార్డులను తారుమారు చేయగలనో ప్రజలే ఆలోచించాలి. ఇక 2005లో నేను ఆ భూములు కొన్నట్లు ఆరోపిస్తున్నారు. అంటే 15 ఏళ్ళ తరువాత ఇప్పుడు ఆ సంగతి మీకు గుర్తొచ్చిందా? 

కేసీఆర్‌ అధికారంలోకి వచ్చి అప్పుడే ఆరేళ్లు అవుతోంది. మరి ఇంతకాలం ఎందుకు ఊరుకొన్నారు? ఇక నాకోసం రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారని చెపుతున్న తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి 2005లో ఎక్కడ పనిచేస్తున్నారో కేసీఆర్‌కు ఏమైనా తెలుసా?ఎప్పుడైనా ఎక్కడైనా మేకలనే బలిస్తారు తప్ప పులులను బలివ్వరు. ఈ వ్యవహారంలో కూడా అలాగే జరిగింది. పాపం అన్యాయంగా ఆయనను సస్పెండ్ చేశారు. 

అయినా ప్రభుత్వం చెపుతున్న ఆ సర్వే నెంబరులో ఉన్న భూమి ప్రైవేట్ వ్యక్తులదే తప్ప ప్రభుత్వానిది కాదు. కనుక దానిని ఎవరైనా ఎప్పుడైనా కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు. అందులో ప్రభుత్వానికి అభ్యంతరం దేనికో నాకు అర్ధం కాదు. నేను ఇప్పటి వరకు గోపనపల్లి ఎక్కడుందో కూడా చూడలేదు. కేసీఆర్‌ ప్రభుత్వం నాపై పెడుతున్న తప్పుడు కేసులు, ఎఫ్ఐఆర్‌లు నా పోరాటాలకు లభిస్తున్న మెడల్స్ వంటివి. వాటి వలన నా గౌరవం ఇంకా పెరుగుతుందే తప్ప ఏమాత్రం తగ్గదు,” అని అన్నారు. 

అప్పుడు గోపనపల్లి భూవివాదంతో తనకు సంబందం లేదన్నట్లు మాట్లాడిన రేవంత్‌ రెడ్డి, ఇప్పుడు ఆ భూములు తమవే అంటూ హైకోర్టులో పిటిషన్‌ వేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఇంతవరకు రేవంత్‌ రెడ్డి సోదరులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకపోవడం కూడా ఆశ్చర్యకరమే. కనుక ఈ భూవివాదంలో రేవంత్‌ రెడ్డి సోదరులు, అటు ప్రభుత్వం కూడా కోర్టులో మొట్టికాయలు వేయించుకోక తప్పదేమో? 


Related Post