కమీషన్‌ను కలిసిన దిశ నిందితుల కుటుంబాలు

March 05, 2020


img

దిశ హత్యాచార కేసులో నలుగురు నిందితులను తెలంగాణ పోలీసులు భూటకపు ఎన్‌కౌంటర్‌ చేశారని దాఖలైన పిటిషన్లపై స్పందించిన సుప్రీంకోర్టు జస్టిస్‌ వికాస్‌ శ్రీధర్‌ సిర్పుర్కర్‌ నేతృత్వంలో జ్యూడీషియల్ కమీషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ కోసం హైదరాబాద్‌ వచ్చిన కమీషన్ సభ్యులను నిందితుల కుటుంబ సభ్యులు గురువారం హైకోర్టులోని వారి కార్యాలయంలో  కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ పోలీసులు భూటకపు ఎన్‌కౌంటర్‌ చేసి కట్టుకధలు చెపుతున్నారని, కనుక ఈ భూటకపు ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులను, వారికి ఆ ఆదేశాలు ఇచ్చిన అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. తమకు జీవనాధారంగా ఉన్నవారిని పోలీసులు పొట్టనపెట్టుకోవడంతో తామందరం రోడ్డున పడ్డామని కనుక తమకు నష్టపరిహారం కూడా ఇప్పించాలని వారు కమీషన్ సభ్యులకు మొరపెట్టుకున్నారు.

ఇటీవల నలుగురు నిందితుల కుటుంబ సభ్యులు నష్టపరిహారం కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయగా, ఈ కేసుపై విచారణ జరుపుతున్న జ్యూడీషియల్ కమీషన్‌ను కలవాల్సిందిగా సూచించింది. ఒకవేళ జ్యూడీషియల్ కమీషన్‌ వారికి న్యాయం చేయకపోతే మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చునని తెలిపింది. 

దిశ హత్యాచారం కేసులో చాలా బలమైన సాక్షాధారాలు ఉన్నందున పోలీసులు నలుగురు నిందితులను న్యాయస్థానానికి అప్పజెప్పి ఉండి ఉంటే జ్యూడీషియల్ కమీషన్‌ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉండేది కాదు. ఒకవేళ న్యాయస్థానం వారికి ఉరిశిక్ష విదిస్తే, నిందితుల కుటుంబాలు నేడు ఈవిధంగా నష్టపరిహారం కోరగలిగేవి కావు. కానీ చట్టానికి అతీతంగా ఎన్‌కౌంటర్‌ జరుగడంతో నిందితులు, భాదితురాలు కూడా చనిపోయినప్పటికీ, ఈ కేసులు... విచారణలు ఇంకా కొనసాగుతున్నాయి. దాంతో ఇప్పుడు పోలీసులు నిందితులుగా, నిందితుల కుటుంబాలు బాధితులుగా మారారు. 


Related Post