తెలంగాణ బిజెపి అధ్యక్షుడు ఎవరో?

March 04, 2020


img

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ పదవీకాలం గత ఏడాది డిసెంబరులో ముగిసింది. కనుక అప్పటి నుంచి కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. పార్టీ జాతీయ కార్యదర్శి అనీల్ జైన్ ఇదే పనిమీద గత నెల 24న హైదరాబాద్‌ వచ్చి పార్టీలో సీనియర్లందరి అభిప్రాయాలు తీసుకున్నారు. కె.లక్ష్మణ్‌ మళ్ళీ మరోసారి అధ్యక్ష పదవిలో కొనసాగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నుంచి బిజెపిలో చేరిన సీనియర్ నేత డికె.అరుణ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. ఎందుకంటే, ఈనెల 15న సీఏఏకు మద్దతుగా హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో బిజెపి భారీ బహిరంగసభ నిర్వహిస్తోంది. దానిలో పాల్గొనేందుకు  కేంద్రహోంమంత్రి అమిత్ షా  వస్తున్నారు. కనుక ఆలోగానే కొత్త అధ్యక్షుడు ఎవరనే విషయంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తాజా సమాచారం ప్రకారం, మళ్ళీ కె.లక్ష్మణ్‌కు కానీ లేదా ఆర్ఎస్ఎస్ మద్దతు ఉన్న బండి సంజయ్‌లలో ఎవరో ఒకరికి అధ్యక్ష పదవి లభించవచ్చునని తెలుస్తోంది. 

2023 అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్‌ను ఓడించి రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలని బిజెపి లక్ష్యంగా పెట్టుకొంది. కానీ బిజెపి ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అది దాదాపు అసంభవంగానే కనిపిస్తోంది. కనుక తెలంగాణ బిజెపి పగ్గాలను ఎవరు చేపట్టినప్పటికీ ఓ పక్క టిఆర్ఎస్‌ను ఎదుర్కొంటూ 2023 నాటికి పార్టీని బలోపేతం చేసుకొని అసెంబ్లీ ఎన్నికలలో గెలవడం పెద్ద సవాలే అని చెప్పవచ్చు. మరి ఈ సవాలును ఎవరు స్వీకరిస్తారో చూడాలి. 


Related Post