ఒకప్పుడు ఎయిడ్స్...ఇప్పుడు కరోనా

March 04, 2020


img

కొత్తగా ఎయిడ్స్ వ్యాధి కనుగొన్న ఆ రోజులలో సమాజంలో ఎయిడ్స్ రోగులను చూసి ప్రజలు దయ్యాన్నో భూతాన్నో చూసినట్లు భయపడేవారు. ఇప్పుడు కరోనా వైరస్ వార్తలతో ఆందోళన చెందుతున్న ప్రజలు సాధారణ జలుబు, దగ్గుతో బాధపడుతున్నవారిని చూసినా కరోనా సోకిందేమోనని భయపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన నాటకీయ పరిణామాలు గురించి విన్నట్లయితే, కరోనా లక్షణాలు కనిపించిన వారి పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.     

జిల్లాలో కొత్తపేట మండలంలోని వాడపాలెంకు చెందిన ఓవ్యక్తి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. కంపెనీ పనిమీద అతను ఇటీవలే దక్షిణ కొరియా వెళ్ళి వచ్చాడు. చైనా తరువాత ఆ దేశంలోనే కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. అతను అక్కడి నుంచి హైదరాబాద్‌ తిరిగి రాగానే తన స్వస్థలమైన వాడపాలెంకు వెళ్ళాడు. 

అతనికి కరోనా వైరస్‌ సోకి ఉండవచ్చని హైదరాబాద్‌లో అధికారులు తూర్పుగోదావరి జిల్లా కలక్టరుకు సమాచారం పంపించారు. దాంతో ఆయన మంగళవారం రాత్రి జిల్లా అధికారులను, పోలీస్ అధికారులను అప్రమత్తం చేశారు. వారు వెంటనే వాడపాలెంకు చేరుకున్నారు. కానీ అతను అక్కడి నుంచి ముమ్మిడివరం మండలంలోని గోదాశివారిపాలెంలో తన అత్తగారింటికి వెళ్ళినట్లు తెలుసుకొని, అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. అప్పటికి సమయం అర్ధరాత్రి 12 గంటలు దాటింది. అర్ధరాత్రి తలుపు తట్టిన పోలీసులను చూసి ఇంట్లోని వారు చాలా కంగారూ పడ్డారు. కానీ విషయం చెప్పి అతనిని కాకినాడలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతని భార్య, తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు, అత్తగారింట్లో అందరికీ కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకొన్న రెండు గ్రామాలలో ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. కరోనా సమస్య తీవ్రతకు ఇది అద్దం పడుతోంది.   



Related Post