సిద్దిపేటలో నెలరోజులలో ఐదుగురు మృతి

March 03, 2020


img

సిద్దిపేట జిల్లాలో నెలరోజులలో ఐదుగురు మృతి చెందారు. వారందరో ఏదో రోగం వచ్చి చనిపోలేదు. టిప్పర్లు గుద్దేయడంతో చనిపోయారు. ఇంకా చాలా మంది చనిపోయే అవకాశం కూడా ఉందని గ్రామస్తులు చెపుతున్నారు. 

సిద్ధిపేటలోని తొగుట, కొండపాక మండలాలలో పరిధిలో మల్లన్న సాగర్ జలాశయం నిర్మించబడుతోంది. దాని కోసం దుబ్బాక, గజ్వేల్ మండలాలలోని గ్రామాల నుంచి నల్లమట్టిని తీసుకొని వెళుతుంటాయి. కనుక ప్రతీరోజు కొన్ని వందల టిప్పర్లు ఆ పది గ్రామాల మద్య నుంచి తిరుగుతున్నాయి. 

రోజూ టిప్పర్లు తిరుగుతుండటంతో పరిసర ప్రాంతాలలో విపరీతమైన దుమ్ముదూళీ చెలరేగుతోంది. దాంతో కొందరు శ్వాససంబందిత సమస్యలతో బాధలు పడుతున్నారు. ఆ బాధలను భరించగలుగుతున్నాము కానీ ఎప్పుడు టిప్పరు కింద నలిగి చనిపోతామో అని అందరూ భయపడుతున్నారు. 

ఫిబ్రవరి 18న మిరుదొడ్డి మండలం బల్వంతాపూర్ గ్రామానికి చెందిన చిట్యాల రాములు (55), మనుమడు భరత్ (11)లను వెంకట్రావుపేట వద్ద టిప్పరు డ్డీ కొనడంతో చనిపోయారు. ఫిబ్రవరి 23న వర్గల్ మండలంలోని మజీదుపల్లికి చెందిన సాయి, శేఖర్ అనే ఇద్దరు స్నిహితులు బైక్‌పై వెళుతుండగా ప్రజ్ఞాపూర్ గ్రామం సమీపంలో టిప్పరు డ్డీకొనడంతో ఇద్దరూ ఘటనాస్థలంలోనే చనిపోయారు. మార్చి 1న గజ్వేల్ మండలం కొలుగూరుకు చెందిన పరుశురాములు అలాగే చనిపోయాడు. 

ప్రమాదం జరిగినప్పుడు పోలీసులు వచ్చి హడావుడి చేసి గ్రామస్తులకు నచ్చజెప్పి వెళ్లిపోవడమే తప్ప ఇంతవరకు ఈ ప్రమాదాల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కనుక మల్లన్నసాగర్ జలాశయం పూర్తయ్యేసరికి అక్కడి 10 గ్రామాలలో ఇంకెంతమంది టిప్పర్ల కింద నలిగిపోతారో తెలీదని గ్రామస్తులు అంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం, పోలీసులు మేల్కొని తమ ప్రాణాలను కాపాడాలని 10 గ్రామాల ప్రజలు వేడుకొంటున్నారు. 


Related Post