సోషల్ మీడియాకు ప్రధాని మోడీ గుడ్ బై?

March 03, 2020


img

సోషల్ మీడియా నుంచి తప్పుకోవాలనుకొంటున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ సోమవారం రాత్రి చేసిన ట్వీట్ సంచలనం సృష్టించింది. “ఈ ఆదివారం, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇంస్టాగ్రామ్, యూ ట్యూబ్ వంటి సోషల్ మీడియా నుంచి వైదొలగాలనుకొంటున్నాను. త్వరలోనే నా నిర్ణయం తెలియజేస్తాను,” అని ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్‌ చేశారు.

ప్రధాని నరేంద్రమోడీ 2009లో సోషల్ మీడియాలో చేరారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో అత్యంత ఆదరణ ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆయనకు ట్విట్టర్‌లో 5.33 కోట్లు, ఫేస్‌బుక్‌లో 4.4 కోట్లు, ఇంస్టాగ్రామ్‌లో 3.52 కోట్లు, యూ ట్యూబ్‌లో 0.45 కోట్లు మంది ఫాలోవర్లున్నారు. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఇటీవల భారత్‌లో పర్యటించినప్పుడు డిల్లీలో మాట్లాడుతూ “సోషల్ మీడియాలో నేనూ, ప్రధాని నరేంద్రమోడీ అత్యధిక ఫాలోవర్లతో అగ్రస్థానంలో ఉన్నాము,” అని చెప్పారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇంతవరకు ఒక్కసారి కూడా మీడియాతో ముఖాముఖి సమావేశం నిర్వహిచని నరేంద్రమోడీ సోషల్ మీడియా ద్వారానే దేశప్రజలతో తన అభిప్రాయాలు, ఆలోచనలను పంచుకొంటున్నారు. కనుక సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్రమోడీ ఏ చిన్న సందేశం పెట్టినా క్షణాలలో అది లక్షలమందికి చేరుతోంది. అయితే సీఏఏను ప్రవేశపెట్టినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆయనపై విమర్శలు పెరిగాయి. బహుశః అందుకే ఆయన సోషల్ మీడియా నుంచి తప్పుకోవాలనుకొంటున్నారేమో? 

కారణాలు ఏవైనప్పటికీ, ఆయన నిర్ణయంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన అభిమానులు, బిజెపి నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ప్రజలకు సమాధానాలు చెప్పలేక సోషల్ మీడియా నుంచి పారిపోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. 

ప్రధాని నరేంద్రమోడీ నిర్ణయంపై కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌లో స్పందిస్తూ, “మీరు వీడాల్సింది ద్వేషాన్ని.. సోషల్ మీడియాను కాదు,” అని ట్వీట్ చేశారు.


Related Post