నిర్భయ దోషుల ఉరిశిక్ష మళ్ళీ వాయిదా

March 02, 2020


img

నిర్భయ కేసులో నలుగురు దోషులకు రేపు ఉదయం 6 గంటలు తీహార్ జైల్లో ఉరి తీయవలసి ఉండగా, వారిలో ఒకరు పవన్ గుప్తా ఈరోజు సాయంత్రం రాష్ట్రపతికి క్షమాభిక్ష కోరుతూ పిటిషన్‌ పెట్టుకున్నాడు. చట్ట ప్రకారం ఒకె కేసులో దోషులకు మరణశిక్ష విధించబడితే అందరినీ ఒకేసారి శిక్షను అమలుచేయవలసి ఉంటుంది కనుక డిల్లీ, పటియాలా హౌస్ కోర్టు వారి ఉరిశిక్షను తదుపరి ఆదేశాల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో వారు వరుసగా మూడవసారి ఉరిశిక్ష నుంచి తప్పించుకున్నారు. నలుగురు దోషులలో పవన్ గుప్తా ఒక్కడికే రాష్ట్రపతికి క్షమాభిక్ష కోరుతూ పిటిషన్‌ పెట్టుకొనే అవకాశం మిగిలి ఉంది. దానిని చివరి నిమిషంలో ఉపయోగించుకొన్నాడు. ఇప్పటికే మిగిలిన ముగ్గురి క్షమాభిక్ష పిటిషన్‌లను తిరస్కరించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, పవన్ గుప్తా పెట్టుకొన్న పిటిషన్‌ను కూడా వెంటనే తిరస్కరించారు. కనుక నిబందనల ప్రకారం పిటిషన్‌ తిరస్కరించబడిన రోజు నుంచి అంటే నేటి నుంచి రెండు వారాలవరకు అతనిని ఉరి తీయడానికి వీలులేదు. అంటే ఈనెల 16వరకు వారిని ఉరి తీయడానికి వీలులేదు.

కానీ ఆ గడువు ముగిసే సమయానికి మళ్ళీ అతను సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్‌ వేసుకొనే అవకాశం ఉంటుంది. దానిపై సుప్రీంకోర్టు వెంటనే విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఆవిధంగా జరిగినట్లయితే ఈనెల 17,18 తేదీలలో ఎప్పుడైనా నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుచేయవచ్చు.

కానీ మూడు నెలలలో తేల్చాల్సిన ఈ కేసును 8 ఏళ్ళుగా సాగదీసుకొంటూవచ్చి, ఈ ఆఖరి రోజులలో చట్టంలోని లోపాలను లేదా అవకాశాలను చాలా తెలివిగా ఉపయోగించుకొంటూ ఉరిశిక్ష అమలుకానీయకుండా అడ్డుపడుతున్న వారి న్యాయవాది ఏపీ సింగ్ బుర్రలో ఇంకా ఎన్ని ఆలోచనలున్నాయో ఎవరికీ తెలీదు. కనుక నిర్భయ దోషులకు ఉరిశిక్ష ఇంకా ఎప్పుడు అమలవుతుందో తెలీని పరిస్థితులు నెలకొన్నాయి. 


Related Post