ఆనాడు నిర్భయ...ఈనాడు దోషులు మృత్యువుతో పోరాటం

March 02, 2020


img

ఇంచుమించు 8 ఏళ్ళ క్రితం డిల్లీలో కదులుతున్న ఓ బస్సులో సామూహిక అత్యాచారానికి గురైన నిర్భయ, సుమారు రెండువారాలపాటు మృత్యువుతో పోరాడి చనిపోయింది. “తనకు బ్రతకాలని ఉందని” ఆమె ఆనాడు చెప్పింది. 

ఆనాడు ఆమెపై ఆ అకృత్యానికి పాల్పడిన నలుగురు దోషులు కూడా నేడు సరిగ్గా అటువంటి పరిస్థితులలోనే తమ ప్రాణాల కోసం న్యాయపోరాటాలు చేస్తుండటం విశేషం. చావు తప్పదని తెలిసి ఉన్నా మరో వారం పదిరోజులైనా బ్రతకాలని తాపత్రయపడుతుండటం విశేషం.

మంగళవారం ఉదయం 6 గంటలకు నాలుగురినీ ఒకేసారి ఉరి తీయాలనే డిల్లీ, పటియాలా హౌస్ కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్స్ పై స్టే మంజూరు చేయవలసిందిగా కోరుతూ దోషులలో ఒకడైన అక్షయ్ కుమార్ మళ్ళీ అదే కోర్టులో ఈరోజు పిటిషన్‌ వేయగా దానిని న్యాయస్థానం కొట్టివేసింది. మరో దోషి పవన్ గుప్తా వేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈరోజు తిరస్కరించింది. 

కానీ వారిలో పవన్ గుప్తా ఇంతవరకు రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టుకోకుండా, ఉరిశిక్షను వాయిదా వేయించడానికి  దానినో ఆయుధంగా భద్రంగా దాచుకున్నాడు. ఈరోజు ఆ అవకాశాన్ని వినియోగించుకొంటూ రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టుకొన్నట్లు తెలుస్తోంది. అంటే మళ్ళీ నలుగురు మరోసారి ఉరిశిక్ష నుంచి తప్పించుకొనే అవకాశం కనిపిస్తోంది. ఒకపక్క ఈ నాటకీయ పరిణామాలు కొనసాగుండగానే మరో పక్క రేపు ఉదయం వారిని ఉరి తీసేందుకు తీహార్ జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


Related Post