ఆందోళనకర స్థాయిలో ఆత్మహత్యలు

March 02, 2020


img

నిర్భయ కేసులో నలుగురు దోషులకు మంగళవారం ఉదయం 6 గంటలకు ఉరి తీయవలసి ఉండగా వారు చివరి నిమిషం వరకు ఉరిశిక్షను తప్పించుకొనేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. చట్టంలో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకొని ఇప్పటికే వారు రెండుసార్లు ఉరిశిక్ష నుంచి తప్పించుకున్నారు. బహుశః రేపు కూడా అలాగే మరోసారి తప్పించుకోవచ్చు. ఏదో రోజు ఉరిశిక్ష తప్పదని తెలిసి ఉన్నప్పటికీ మరికొన్ని రోజులైనా ప్రాణాలను కాపాడుకొనేందుకు వారు ప్రయత్నిస్తుంటే, భార్యాభర్తల మద్య విభేదాలు, చదువుల ఒత్తిళ్ళు, చిన్నా, పెద్ద సమస్యలతో అనేకమంది ఆత్మహత్యలు చేసుకొంటుండటం విస్మయం కలిగిస్తుంది. 

హైదరాబాద్‌ వనస్థలిపురంలో హస్తినాపురంలో నివాసం ఉంటున్న ప్రదీప్ (33), స్వాతి (29) దంపతులు చేసిన అప్పులు చేసి తీర్చలేక అభంశుభం తెలియని తమ పిల్లలు కళ్యాణ్ కృష్ణ (6), జయకృష్ణ (2)లకి అన్నంలో విషం కలిపి పెట్టి తరువాత వారు కూడా విషాహారం తిని ఆత్మహత్యలు చేసుకొన్నారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగినట్లు తెలుస్తోంది. 

ప్రదీప్ ఐబిఎంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. రెండేళ్ళ క్రితమే వారు హస్తినాపురంలో సొంత ఇల్లు కూడా కొనుకొన్నారు. ప్రదీప్ తల్లితండ్రులు బాగా ఆస్తిపరులేనని స్వాతి తండ్రి చెప్పారు. స్వాతి ఎంఎస్సీలో గోల్డ్ మెడలిస్ట్. ఆమె తల్లితండ్రులు కూడా బాగా ఉన్నవారే. అంటే దంపతులిద్దరూ ఆర్ధికంగా ఉన్నవారే..ఉన్నత విద్యావంతులేనని స్పష్టం అవుతోంది. 

కానీ ప్రదీప్ వ్రాసిన సూసైడ్ నోట్‌లో “నేను మంచిగా, గొప్పగా బతకాలని అనుకున్నాను..వ్యాపారంలో  పెట్టుబడులు పెట్టి సుమారు 40 లక్షల వరకు నష్టపోయాను.  ఈ వయస్సులో నిన్ను ఇబ్బందులు పెట్టకూడదని, నా పిల్లలు నీకు భారం కాకూడదని అందరం కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నాము. నన్ను క్షమించండి నాన్న,’’ అని వ్రాసినట్లు తెలుస్తోంది. 

స్వాతి తండ్రి మీడియాతో మాట్లాడుతూ, “మా అల్లుడు ప్రదీప్‌కు ఆత్మహత్య చేసుకోవలసిన అవసరం లేనేలేదు. వాళ్ళకు కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయి. వాటిలో కొంచెం అమ్ముకున్నా అప్పులన్నీ తీరిపోయేవి. కానీ ప్రదీప్ ఈవిధంగా ఎందుకు తొందరపడ్డాడో మాకు అర్ధం కావడం లేదు,” అని అన్నారు. 

మృత్యువు కళ్లెదుట కనబడుతున్నా బ్రతకడం కోసం నిర్భయ దోషులు ధైర్యంగా పోరాడుతుంటే, అన్నీ ఉండీ కూడా ప్రదీప్ ఆత్మహత్య చేసుకోవడాన్ని ఏమనుకోవాలి? పైగా భార్యకు ఇంకా లోకం చూడని పిల్లలకు కూడా విషం పెట్టి వారి ప్రాణాలు బలిగొనడాన్ని ఏమనుకోవాలి? 

నిర్భయ దోషులు మృత్యువును సవాలుగా స్వీకరించి దాని నుంచి బయటపడేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్గాలు ఆన్వేషిస్తుంటే, అసలు సమస్యలే లేని ప్రదీప్ వంటివారు సమస్యలను సృష్టించుకొని వాటిని ఎదుర్కొలేక భయపడి ఆత్మహత్యలు చేసుకొంటుండటం ఏమనుకోవాలి? నానాటికీ పెరిగిపోతున్న ఈ ఆత్మహత్యలు ఒక సామాజిక సమస్యగా మారే ప్రమాదం కనిపిస్తోంది.


Related Post