ఆదిలాబాద్‌లో అకాలవర్షం..తడిసిన కందులు

March 02, 2020


img

ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదివారం రాత్రి బోథ్, బజార్ హత్నూర్, ఇచ్చోడ, నేరడిగొండ మండలాలలో అకాలవర్షం కురిసింది. దాంతో మార్కెట్‌ యార్డులలో ఆరుబయట ఉన్న వందల టన్నుల కందులు నీళ్ళలో తడిసిపోయాయి. మార్కెట్‌ యార్డుకు కందులు తెచ్చి మూడు నాలుగు రోజులు అవుతున్నా మార్కెట్ అధికారులు కొనుగోళ్ళు ప్రారంభించకుండా ఆలస్యం చేసినందుకు తాము నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనుక తడిసిన కందులను గిట్టుబాటు ధరకే కొనుగోలు చేయాలని రైతులు పట్టుబడుతున్నారు. 

రైతులు అప్పులు చేసి రేయింబవళ్ళు కష్టపడి పండించిన పంటలను మార్కెట్ యార్డుకు తీసుకువస్తే, మార్కెట్ అధికారులు వెంటనే కొనుగోలు చేయకుండా ఏదో వంకతో ఆలస్యం చేస్తుండటం, సరిగ్గా అటువంటి సమయంలోనే అకాలవర్షాలు పడి అమ్మకానికి సిద్దంగా ఉన్న వారి ఉత్పత్తులు తడిసిపోవడం, అన్నదాతలు ఈవిధంగా కన్నీళ్లు పెట్టుకోవడం ప్రతీ ఏటా జరుగుతున్నదే. కానీ వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రులు, అధికారులు ఎవరూ వారి సమస్యలను పట్టించుకోకపోవడం చాలా శోచనీయం. 

రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు కడుతోంది. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తోంది. రైతుబంధు అమలుచేస్తోంది. తత్ఫలితంగా రాష్ట్రంలో వ్యవసాయోత్పత్తి గణనీయంగా పెరిగింది. అది చాలా సంతోషించవలసిన విషయమే. కానీ అన్నీ చేసి రైతులు పండించిన పంటలను సకాలంలో కొనుగోళ్ళు చేయకపోతే... పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించలేకపోతే ప్రభుత్వం అమలుచేస్తున్న ఈ పధకాలు, ప్రాజెక్టుల వలన ఏమి ప్రయోజనం? 


Related Post