ఛార్మినార్ వద్ద భద్రతాదళాలు ఫ్లాగ్ మార్చ్...తప్పా?

February 29, 2020


img

సీఏఏకు వ్యతిరేకంగా, అనుకూలంగా ఈశాన్య డిల్లీ ప్రాంతాలలో మూడు రోజులపాటు కొనసాగిన విధ్వంసంతో కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో పలు రాష్ట్రాలలో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నందున, అక్కడా మళ్ళీ ఇటువంటి విధ్వంసకరఘటనలు పునరావృతం కాకుండా, హైదరాబాద్‌తో సహా ఆందోళనలు జరిగిన, జరుగుతున్న ప్రాంతాలలో భద్రతాదళాలను మోహరించింది. శనివారం ఉదయం ఛార్మినార్ వద్ద రాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి. ప్రజలకు భరోసా కల్పించేందుకే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు సంబందిత అధికారులు తెలిపారు. అయితే నగరంలో మరెక్కడా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించకుండా  ఛార్మినార్ వద్ద మాత్రమే నిర్వహించడాన్ని మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తప్పుపట్టినట్లు తెలుస్తోంది. 

డిల్లీలో అల్లర్లలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 2-300 మంది గాయపడ్డారు. కోట్లరూపాయల ఆస్తినష్టం జరిగింది. అప్పుడు మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీతో సహా దేశవ్యాప్తంగా పలువురు నేతలు అల్లర్లను నియంత్రించడంలో కేంద్రప్రభుత్వం విఫలమైందని విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ మరో అడుగు ముందుకు వేసి ఈ అల్లర్లకు కేంద్రహోంమంత్రి అమిత్ షా నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ముఖ్యంగా డిల్లీలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పుడు యావత్ ప్రపంచదేశాల దృష్టి డిల్లీపైనే ఉంటుంది. అటువంటి సమయంలో ఈ విధ్వంసకాండ జరగడంతో అంతర్జాతీయ మీడియా వాటి గురించి ప్రస్తావిస్తూ వ్రాసిన కధనాలతో భారత్‌ ప్రతిష్ట మసకబారింది. కనుక కేంద్రప్రభుత్వం మళ్ళీ అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకొంటున్నప్పుడు అందరూ స్వాగతించాలి తప్ప విమర్శించడం సరికాదు.


Related Post