పోలీస్ శాఖ పరువు తీసిన కానిస్టేబుల్‌పై వేటు

February 28, 2020


img

సిఎం కేసీఆర్‌ నిన్న దారిన పోయే ఓ వృద్ధుడిని మానవత్వంతో ఆదుకొని అందరిచేత జేజేలు పలికించుకోగా, సంగారెడ్డి జిల్లాలో శ్రీధర్ అనే ఓ హెడ్ కానిస్టేబుల్ కన్నకూతురును కోల్పోయి దుఃఖంతో శోకిస్తున్న ఓ తండ్రిని బూటుకాలితో తన్ని అందరి చేత చీత్కరించబడ్డాడు. 

మహబూబ్‌నగర్‌ జిల్లా యెనుగొండకు చెందిన సంధ్యారాణి (16) సంగారెడ్డిలో వెలిమలలో గల నారాయణ కాలేజీలో ఇంటర్ ప్రధమ సంవత్సరం చదువుతోంది. మంగళవారం ఆమె కాలేజీలో బాత్రూములో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది. కూతురు ఆత్మహత్య చేసుకొందని తెలిసి రోదిస్తూ వచ్చిన ఆమె తల్లితండ్రులు చంద్రశేఖర్, పద్మ తమ బిడ్డ చావుకు కారణమైన కాలేజీ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్ది సంఘాలతో కలిసి కాలేజీ ముందు ధర్నా చేశారు. 

తమ బిడ్డకు ఆరోగ్యం సరిగ్గా లేనందున కొన్ని రోజులు శలవు ఇచ్చి ఇంటికి పంపించాలని తాము ఎంతగా వేడుకొన్నప్పటికీ నారాయణ కళాశాల యాజమాన్యం అంగీకరించలేదని, ఆ ఒత్తిడి భరించలేకనే తమ కూతురు ఉరి వేసుకొని చనిపోయిందని ఆ బాలిక తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసేంతవరకు కూతురు శవాన్ని కదలనీయమని చెపుతూ బాలిక తల్లితండ్రులు పోలీసులను అడ్డుకున్నారు. 

అప్పుడు పోలీసులు వారిని పక్కకు తోసేసి బాలిక శవాన్ని ఆసుపత్రికి తీసుకువెళ్ళేందుకు ప్రయత్నించగా, బాలిక తండ్రి కూతురు శవం ఉంచిన  ఫ్రీజర్ బాక్సు పట్టుకొని అడ్డుకున్నారు. ఆ త్రోపులాటలో ఆయన నేలపై పడిపోయారు. అయినా ఫ్రీజర్ బాక్సును విడిచిపెట్టకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్ ఆయన కడుపులో బూటుకాలితో ఇష్టం వచ్చినట్లు తన్నాడు. దానిని అక్కడే ఉన్న విద్యార్ధులు తమ మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసి ట్విట్టర్‌లో కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు. కేటీఆర్‌ వెంటనే స్పందించి డిజిపి మహేందర్ రెడ్డి దృష్టికి దీనిని తీసుకువెళ్లగా, హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్‌ను విధులలో నుంచి తొలగించి, జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అతనిపై విచారణకు ఆదేశించారు. 

గత ఐదేళ్ళలో తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే అత్యుత్తమైనదిగా మంచిపేరు సంపాదించుకొంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో ప్రజలకు మరింత చేరువవుతోంది. మరోపక్క సిఎం కేసీఆర్‌,కేటీఆర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ప్రజలతో మమేకం అవుతూ వారి ఆదరాభిమానాలు సంపాదించుకొని ప్రజల చేత జేజేలు పలికించుకొంటుంటే, శ్రీధర్ వంటి వ్యక్తులు అటు ప్రభుత్వం, ఇటు పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించడం చాలా శోచనీయం. 


Related Post