పెద్దనోట్లు రద్దు పుకార్లపై సీతారామన్ వివరణ

February 27, 2020


img

ప్రధాని నరేంద్రమోడీ 2016, నవంబర్ 8న పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో భారత్‌ ఆర్ధికవ్యవస్థను మళ్ళీ గాడిన పెట్టాలని ప్రధాని మోడీ అనుకుంటే అందుకు పూర్తి విరుద్దంగా జరిగింది. దేశంలో అన్ని స్థాయిలలో అన్ని రకాల వ్యాపారాలు, పరిశ్రమలు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం దారుణంగా దెబ్బతిన్నాయి. దాంతో దేశఆర్ధిక వ్యవస్థ చిన్నా భిన్నం అయ్యింది. పైగా సుమారు ఆరునెలల వరకు తగినంత నగదు సరఫరా జరుగకపోవడంతో సామాన్య ప్రజలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొనేవారు కూడా అష్టకష్టాలకు గురయ్యారు. 

దాంతో అప్పటి వరకు అత్యంత ప్రజాదారణ పొందుతున్న ప్రధాని నరేంద్రమోడీ పెద్దనోట్లు రద్దు చేసినందుకు ప్రజాగ్రహానికి గురయ్యారు. కనుక మోడీ మళ్ళీ అటువంటి తప్పు చేయరనే అందరూ భావిస్తున్నారు. కానీ నల్లధనం అరికట్టేందుకు రూ.1,000 నోట్లను రద్దు చేసి వాటిస్థానంలో ఇంకా పెద్దవైన రూ.2,000 నోట్లు ప్రవేశపెట్టి విమర్శలకు గురయ్యారు. మోడీకి సన్నిహితులైన కొందరు కార్పొరేట్ సంస్థల అధినేతలకు మరింత సులువుగా నల్లధనం పోగేసుకొందుకే వాటిని ప్రవేశపెట్టారనే విమర్శలు వినిపించాయి. 

కారణాలు ఏవైతేనేమీ, క్రమంగా దేశంలో రూ.2,000 నోట్లు కనుమరుగవుతున్నాయి. బ్యాంకులలో తప్ప ఏటిఎంలలో ఆ నోట్లు రాకపోవడంతో రిజర్వ్ బ్యాంక్ వాటి ముద్రణ నిలిపివేసిందని, కనుక ఖాతాదారులకు వాటిని జారీ చేయడం నిలిపివేయాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఆ ఊహాగానాలపై ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందిస్తూ, “కేంద్రప్రభుత్వం బ్యాంకులకు అటువంటి ఆదేశాలు జారీ చేయలేదు. రూ.2,000 నోట్లను రద్దు చేసే ఆలోచన కూడా చేయడం లేదు. కనుక వాటి గురించి మీడియాలో వస్తున్న వార్తలన్నీ పుకార్లే. కనుక ప్రజలెవరూ వాటిని పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు. 


Related Post