మక్కా దర్శనాలకు కరోనా ఎఫెక్ట్

February 27, 2020


img

చైనాలో మొదలైన కరోనా వైరస్‌ (కోవిడ్19) ఆసియా, గల్ఫ్ దేశాలకు వ్యాపిస్తుండటంతో సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. ఇక నుంచి కరోనా ప్రభావిత దేశాలనుంచి మక్కాకు వచ్చే భక్తులకు వీసాలు మంజూరుచేయకూడదని నిర్ణయించింది. 

ఆసియాలో భారత్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్ దేశాల నుంచి, అలాగే అన్ని గల్ఫ్ దేశాల నుంచి ఏటా కోట్లమంది భక్తులు హజ్, ఉమ్రా యాత్రలకు వెళుతుంటారు. కరోనా వైరస్‌కు శరవేగంగా వ్యాపించే లక్షణాలు ఉన్నందున, మక్కాకు వచ్చేవారిలో ఆ వ్యాధి ఉన్నవారు ఒక్కరున్నా అది వెంటనే లక్షలాదిమందికి వ్యాపించే ప్రమాదం ఉంటుంది. అది అక్కడితో ఆగదు సౌదీ అరేబియా దేశంలో కూడా వ్యాపించే ప్రమాదం ఉంది. మక్కాకు అనేక దేశాల నుంచి భక్తులు వస్తుంటారు కనుక వారికి కరోనా సోకినట్లయితే అది వారి ద్వారా ఆయా దేశాలకు కూడా పాకే ప్రమాదం ఉంటుంది. పైగా కరోనా వైరస్‌ను గుర్తించడం, వ్యాధిగ్రస్తులకు వైద్యం అందించడం, అది ఇతరులకు సోకకుండా నివారించడం కోసం చాలా శ్రమపడాల్సి వస్తుంది. అంతకంటే కరోనా ప్రభావిత దేశాలకు వీసాలు నిలిపివేయడమే సులువు కనుక సౌదీఅరేబియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. అయితే ఏఏ దేశాలపై ఎంతకాలం ఈ నిషేధం అమలుచేయాలనుకొంటోందో తెలియజేయలేదు.

చైనాలో అధికార గణాంకాల ప్రకారం 3,000 మందికి పైగా చనిపోయినట్లు సమాచారం కానీ అంతకంటే చాలా ఎక్కువ మందే చనిపోయుండవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కరోనా దెబ్బకు పలు రంగాలు నష్టపోతున్నాయి. చివరికి ఇటువంటి యాత్రలకు కూడా ఆటంకం ఏర్పడటం బాధాకరమే. ఈ కరోనా వైరస్‌ మహమ్మారి ఇంకా ఎంతమందిని బలి తీసుకొంటుందో..ఎన్ని దేశాలకు వ్యాపిస్తుందో..ఎప్పటికీ అంతమవుతుందో...తెలీని పరిస్థితులు నెలకొన్నాయి.


Related Post