ఇకపై కాశ్మీరులో కూడా భారత్‌ చట్టాలు అమలు

February 27, 2020


img

భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 73 ఏళ్ళగా ఆర్టికల్ 370 అమలులో ఉంది. దాంతో జమ్ముకశ్మీర్‌ రాష్ట్రం ప్రత్యేకప్రతిపత్తి కలిగి ఉండేది. కనుక అక్కడ కేంద్రప్రభుత్వ చట్టాలను అమలుచేయలేని స్థితి నెలకొని ఉండేది. ఆర్టికల్ 370 రద్దు గురించి దశాబ్ధాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి కానీ గతంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం దానిని రద్దు చేసే ధైర్యం చేయలేకపోయింది. గత ఏడాది మోడీ ప్రభుత్వం దానిని రద్దు చేయడమే కాక, వేర్పాటువాదాన్ని అణచివేసి జమ్ముకశ్మీర్‌లో మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్‌, లడాక్‌ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. 

కేంద్రం నిర్ణయంపై ప్రతిపక్షాలు, జమ్ముకశ్మీర్‌లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్న ప్రాంతీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, ఆ రెండు ప్రాంతాలలో పరిస్థితులు మెల్లగా మళ్ళీ సాధారణస్థితికి చేరుకొంటుండటం, వేర్పాటువాదం తగ్గడంతో ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం సరైనదేనని నిరూపితమవుతోంది. 

ఆ రెండు ప్రాంతాలను భారత్‌తో పూర్తిగా అనుసంధానించాలంటే కేంద్రం ఇంకా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. వాటిలో భాగంగానే కేంద్రప్రభుత్వానికి చెందిన 37 చట్టాలను ఆ రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో అమలుచేసేందుకు వీలుకల్పిస్తూ కేంద్రమంత్రివర్గం ఆమోదముద్రవేసింది. దీంతో యావత్ దేశంలో వర్తించే కేంద్రప్రభుత్వ చట్టాలు ఇక నుంచి జమ్మూకశ్మీర్‌, లడాక్‌ కేంద్రపాలిత ప్రాంతాలలో కూడా అమలవుతాయి. వాటిలో కొన్ని చట్టాలు అమలులోకి వస్తే ఆ రెండు ప్రాంతాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు మొదలవుతాయి. మరికొన్ని చట్టాల ద్వారా అక్కడ ఉన్న రక్షణదళాలకు మరిన్ని అధికారాలు సంక్రమిస్తాయని తెలుస్తోంది.


Related Post