రాష్ట్రంలో మరో కాలువ ప్రమాదం.. ముగ్గురు మృతి

February 27, 2020


img

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఊర్లలో రోడ్డు పక్కన పారే మంచినీటి కాలువలలోకి కార్లు దూసుకుపోయి మృత్యువాత పడుతున్న ఘటనలు వరుసగా జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నల్గొండ జిల్లాలో ఈరోజు ఉదయం  మళ్ళీ అటువంటి ప్రమాదమే జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా, కార్తీక్ అనే ఓ బాలుడిని స్థానికులు కాపాడారు. 

జిల్లాలోని పీఏ పల్లి మండలం, దుంగ్యాల గ్రామంలో రోడ్డు పక్కన పారుతున్న పీఎంఆర్పీ కాలువలోకి కారు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో అదే మండలంలోని వడ్డెరగూదేనికి చెందిన ఓర్సు రఘు (45), అతని భార్య అలివేలు(38), కుమార్తె కీర్తి (18) మృతి చెందారు. వారందరూ ఓ వివాహానికి హాజరయ్యి ఇంటికి తిరిగి వెళుతుండగా, వారి కారు ముందు టైర్ పేలిపోవడంతో కారు అదుపుతప్పి కాలువలో పడిపోయింది. కారులో చిక్కుకుపోయి ముగ్గురూ మృతి చెందగా స్థానికులు బాలుడిని మాత్రం రక్షించగలిగారు. 

ఐదు రోజుల క్రితం అంటే ఈనెల 22న యాదాద్రి భువనగిరి జిల్లా సర్నేనిగూడెం సర్పంచ్ రాణి భర్త మధు, కుమారుడు మత్స్యగిరి ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ఎల్లంకిచెరువులో దూసుకుపోవడంతో కారు డ్రైవరు శ్రీధర్ రెడ్డితో సహా ముగ్గురూ చనిపోయారు. 

ఈనెల 17న గన్నేరు మండల కేంద్రానికి చెందిన పి.వెంకట నారాయణ ప్రదీప్, భార్య కీర్తన కలిసి బైక్‌పై కరీంనగర్‌లో ఓ శుభకార్యానికి హాజరయ్యి సాయంత్రం తిమ్మాపూర్ మండలంలోని శ్రీ తాపాల లక్ష్మీనృసింహస్వామి ఆలయానికి వెళుతుండగా ప్రమాదవశాత్తూ వారి బైక్‌ కరీంనగర్‌ శివారులో అల్గునూరు వద్ద కాకతీయ కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ప్రదీప్ భార్య కీర్తన మృతి చెందింది.

ఈ ప్రమాదంలో కీర్తన మృతదేహం కోసం కాకతీయ కాలువలో గాలిస్తుండగా, ఓ కారు బయట పడింది.   ఆ కారులో పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి రాధ, ఆమె భర్త సత్యనారాయణ రెడ్డి, వారి కుమార్తె వినయశ్రీ మృతదేహాలు కుళ్ళిపోయిన స్థితిలో కనిపించాయి. వారు ముగ్గురూ గత నెల 27వ తేదీన తమ ఇంటి నుంచి కారులో బయలుదేరినప్పుడు వారి కారు అదుపు తప్పి కాలువలో పడి మునిగిపోవడం వారు చనిపోయారు. ఈ ప్రమాదం జరిగిన 10 రోజుల తరువాత మళ్ళీ అదే కాలువలో అటువంటిదే మరో ప్రమాదం జరిగినప్పుడు కానీ ఈవిషయం బయటపడలేదు.

ఈరోజు నల్గొండలో మళ్ళీ అటువంటి ప్రమాదమే జరిగింది. ఒకే నెలలో వరుసగా ఒకే రకమైన ప్రమాదాలు జరుగుతుండటం, వాటిలో ఇంతమంది ప్రాణాలు కోల్పోతుండటం చాలా బాధాకరమే.


Related Post