కేసీఆర్‌ను పిలిచారు..జగన్‌ను పిలవలేదు?

February 27, 2020


img

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ దంపతుల గౌరవార్ధం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మంగళవారం రాత్రి రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన విందుకు తెలంగాణ సిఎం కేసీఆర్‌కు ఆహ్వానం అందింది కానీ ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డికు రాలేదు. దీనిపై ప్రస్తుతం ఏపీలో వైసీపీ, టిడిపిల మద్య మాటల యుద్ధం జరుగుతోంది. 

ప్రజాచైతన్య యాత్ర పేరిట ఏపీలో పర్యటిస్తున్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడు మొన్న చిత్తూరు జిల్లా కుప్పంలో దీనిపై స్పందిస్తూ, “ఆర్ధిక, క్రిమినల్ నేరాలకు సంబందించి అమెరికా చట్టాలు చాలా కటినంగా ఉంటాయి. కనుక అటువంటి నేరాలతో సంబందం ఉన్నవారిని అమెరికా ప్రభుత్వం దూరంగా ఉంచుతుంది. జగన్‌ నేర చరిత్ర గురించి తెలిసినందునే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో విందుకు ఆహ్వానం రాలేదు,” అని అన్నారు. 

దీనిపై సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ, “దేశ రాజకీయాలలో సీనియర్స్ అయిన పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ, ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్ వంటి 8 మందికి కూడా ఆహ్వానాలు రాలేదు. కనుక ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఆహ్వానం రానందుకు తప్పు పట్టలేము. నిజానికి చంద్రబాబునాయుడుపై పలు ఆర్ధికనేరాలకు సంబందించి కేసులు పెండింగులో ఉన్నాయి. తెలంగాణలో ఓటుకు నోటుకేసులో చంద్రబాబునాయుడు ప్రధాన నిందితుడు. అలాగే అమరావతిలో ఇన్-సైడర్ ట్రేడింగ్ (భూముల కొనుగోలు) వ్యవహారంలో, తాజాగా బయపడిన ఈఎస్ఐ కుంభకోణంలో చంద్రబాబునాయుడు ప్రమేయం ఉంది. తనపై ఉన్న అవినీతి, అక్రమాల కేసుల గురించి మాట్లాడని చంద్రబాబునాయుడు, ట్రంప్ విందుతో సంబందం లేని జగన్ కేసుల గురించి మాట్లాడటం                 బోడిగుండుకు మోకాలుకు ముడివేసే ప్రయత్నమే అని చెప్పవచ్చు. అయినా జగన్ ట్రంప్ విందులో పాల్గొనకపోతే రాష్ట్రానికి వచ్చే నష్టం ఏమీ లేదు. ప్రజామోదంతో అధికారం చేపట్టిన ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డిని గౌరవించడం చంద్రబాబునాయుడు నేర్చుకుంటే మంచిది,” అని అన్నారు.


Related Post