ట్రంప్‌కు క్లారిటీ ఉంది...మనకే లేదేమో?

February 26, 2020


img

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పర్యటనతో భారత్‌కు ఏమి లబ్ది కలిగిందో తెలియదు కానీ మూడు బిలియన్ డాలర్ల విలువగల రక్షణ సామాగ్రిని భారత్‌కు అమ్ముకొని అమెరికాకు భారీగా లబ్ది చేకూర్చుకున్నారు. పైగా అమెరికా నుంచి భారత్‌కు దిగుమతి అవుతున్న వస్తువులపై భారత్‌ ప్రభుత్వం భారీగా పన్నులు వసూలు చేయడాన్ని తప్పు పడుతున్నట్లు ట్రంప్ మాట్లాడారు. కానీ వాణిజ్యపరమైన అంశాలలో ట్రంప్ భారత్‌కు ఎటువంటి హామీ, భరోసా ఇవ్వలేదు. అంటే ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ అనే తన విధానాన్ని భారత్‌ వచ్చినప్పుడు కూడా తూచా తప్పకుండా పాటించారని అర్ధమవుతోంది. 

ట్రంప్ కనీసం భారత్‌కు ఉపశమనం కలిగేలా ఏమైనా మాట్లాడారా...అంటే అదీ లేదు. పాక్‌ వాదనలను సమర్ధిస్తూ ‘కశ్మీర్ ఓ పెద్ద సమస్య’ అని అన్నారు. ఈ అంశంపై ఇతర దేశాల జోక్యం అవసరం లేదని భారత్‌ పదేపదే చెపుతున్నా తాను మద్యవర్తిత్వం వహించి సమస్యను పరిష్కరిస్తానని ట్రంప్ చెప్పడం విస్మయం కలిగిస్తుంది. ట్రంప్ అంత ధైర్యంగా చెప్పగలిగినప్పుడు, ప్రధాని నరేంద్రమోడీ కూడా ధైర్యంగా దానిని ఖండించి ఉంటే, ట్రంప్ చెప్పినట్లు ప్రధాని నరేంద్రమోడీ చాలా శక్తివంతమైన నేత అని లోకానికి అర్ధం అయ్యుండేది. ట్రంప్ కుటుంబ సమేతంగా భారత్‌ రావడం దౌత్యవిజయమని కేంద్రప్రభుత్వం భుజాలు చరుచుకొనేలోగానే ‘కశ్మీర్ ఓ పెద్ద సమస్య’ అంటూ ట్రంప్ గాలి తీసేశారు.    

ప్రపంచదేశాల సమస్యలన్నిటినీ పరిష్కరించవలసిన బాధ్యత తమదేనన్నట్లు అమెరికా ఎప్పుడూ వ్యవహరిస్తుంటుంది. కనుక కశ్మీర్ సమస్యను కూడా పరిష్కరించాలనుకొంటున్న ట్రంప్ పాకిస్థాన్‌లో ఉగ్రవాదం లేకుండా చేయగలిగితే చాలు. భారత్‌-పాక్‌ సంబందాలు వాటంతట అవే గాడిన పడతాయి. 

ముస్లింలందరూ ఉగ్రవాదులే అన్నట్లుగా భావించే ట్రంప్, అధ్యక్ష పదవి చేపట్టగానే ఆరు ముస్లిం దేశాలకు చెందిన పౌరులు అమెరికాలో ప్రవేశించకుండా నిషేదించిన సంగతి మరిచిపోయి, భారత్‌లో ముస్లింల యోగక్షేమాలు, వారి మతస్వేచ్ఛ గురించి మాట్లాడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అదే నోటితో ‘ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని’ అణచివేస్తున్నానని గొప్పగా చెప్పుకోవడం ముస్లింలందరినీ అవమానించడమే అవుతుంది. 

సీఏఏ భారత్‌ అంతర్గత వ్యవహారం అంటూనే డిల్లీలో జరుగుతున్న అల్లర్ల గురించి తానేమీ మాట్లాడబోనని చెప్పడం నోటితో నవ్వి నొసటితో వెక్కిరించడమే.

ఒకవేళ భారత్‌తో 3 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందమే లేకుంటే ట్రంప్ భారత్‌ పర్యటనకు వచ్చేవారో లేదో?అమెరికాకు 3 బిలియన్ డాలర్ల లబ్ది కలిగింది కనుక ట్రంప్ పర్యటన విజయవంతమైనట్లే. కానీ ట్రంప్ దొరను ప్రసన్నం చేసుకొనేందుకు కేంద్రప్రభుత్వం, గుజరాత్ ప్రభుత్వం ఖర్చు చేసిన కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అయినట్లే చెప్పక తప్పదు. 


Related Post