నీట మునగనున్న అనంతగిరి గ్రామం

February 25, 2020


img

రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరి గ్రామప్రజలకు పెద్ద కష్టమే వచ్చింది. వారి ఊరు గోదావరి జలాలలో మునిగిపోబోతోంది. మిడ్‌మానేరు నుంచి మల్లన్నసాగర్‌కు గోదావరి జలాలు చేరుకోవాలంటే ఆ మార్గంలో ఉన్న అనంతగిరి గ్రామం నీటమునగక తప్పదు. కనుక ఆ గ్రామంలో నివాసం ఉంటున్న 837 కుటుంబాల కోసం జిల్లా అధికారులు గ్రామశివార్లలో పునరావాస కాలనీ ఏర్పాటు చేశారు. కానీ వారిలో 102 కుటుంబాలు గ్రామం వదిలి వెళ్ళేందుకు నిరాకరిస్తున్నారు.  

అనంతగిరి గ్రామప్రజల కోసం తంగళ్ళపల్లి శివారులో 62 ఎకరాలు, అనంతగిరి పోచ్చమ్మ ఆలయం సమీపంలో 70 ఎకరాలు కేటాయించి అక్కడ పునరావాస కాలనీలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అనంతగిరిని ఖాళీ చేసేందుకు అంగీకరించిన 737 కుటుంబాలలో ఒక్కో కుటుంబానికి ఇల్లు నిర్మించుకునేందుకు 250 గజాలు స్థలం, రూ.7.50 లక్షలు ఆర్ధిక సాయం ప్రభుత్వం అందజేసింది. కానీ ఇప్పుడప్పుడే గ్రామంలోకి నీళ్ళు రావని భావించిన 102 కుటుంబాలు అరకొర సౌకర్యాలతో ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలో ఉండేందుకు ఇష్టపడక నేటికీ గ్రామంలోని తమ ఇళ్లలోనే ఉంటున్నారు. వారికి ప్రభుత్వం కేటాయించిన స్థలాలలో ఇంతవరకు ఇళ్ళు కూడా నిర్మించుకోలేదు. ఇంతకాలం నీటి విడుదలకు ఏర్పాట్లు పూర్తి కానందున అధికారులు కూడా వారిపై ఒత్తిడి చేయకపోవడంతో తమకేమీ కాదనుకున్నారు. కానీ ఇప్పుడు హటాత్తుగా అధికారులు వచ్చి ఇళ్ళు ఖాళీ చేయాలని చెపుతుండటంతో ఆ 102 కుటుంబాలు ఇప్పుడు ఎక్కడ తలదాచుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. అందుకే ఇప్పటికిప్పుడు ఊరు వదిలిపోలేమని, తమకు మరికొంత సమయం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. కానీ వారిని కూడా ఖాళీ చేయిస్తే తప్ప మిడ్‌మానేరు నుంచి దిగువకు నీటిని విడుదల చేయలేరు. కనుక జిల్లా కలక్టరు కృష్ణ భాస్కర్, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, స్థానిక అధికారులు వారికి నచ్చజెప్పి ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. వారు ఇంకా భీష్మించుకొని కూర్చోంటే పోలీసుల సాయంతో బలవంతంగా ఖాళీ చేయించి పునరావాస కాలనీకి తరలించే అవకాశం ఉంది. రెండు మూడు రోజులలోనే గ్రామాన్ని ఖాళీ చేయించి మిడ్‌మానేరు నుంచి నీటిని విడుదల చేయించాలని భావిస్తున్నారు. 



Related Post