బిజెపిని ఓడించేందుకు ఓటమికి సిద్దపడిన కాంగ్రెస్‌!

February 08, 2020


img

డిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఈరోజు ఉదయం 8 గంటలకు పోలింగ్ మొదలైంది. డిల్లీలో అధికార ఆమాద్మీ పార్టీతో కాంగ్రెస్‌, బిజెపిలు పోటీ పడుతున్నాయి. అయితే 2015లో ఆమాద్మీ పార్టీ తిరుగులేని మెజార్టీతో డిల్లీలో అధికారంలోకి  వచ్చినప్పటి నుంచి పేదలు, మధ్యతరగతి ప్రజలకు లబ్ది కలిగించే అనేక సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టింది. ఆ కారణంగా బిజెపి వైపుకు వెళ్ళేందుకు ఇష్టపడని కాంగ్రెస్‌ ఓటు బ్యాంక్ క్రమంగా ఆమాద్మీవైపు మళ్ళింది. దాంతో కాంగ్రెస్‌ ఇంకా బలహీనపడగా ఆమాద్మీ ఇంకా బలపడింది. 

ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌ ఓటమి ఖాయమని ఆ పార్టీ అధిష్టానం ముందే గ్రహించడంతో బిజెపిని అడ్డుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా ఆమాద్మీకి సహకరిస్తోందని బిజెపి నేతలు వాదిస్తున్నారు. గత ఎన్నికలలో మొత్తం 70 నియోజకవర్గాలలో బలమైన అభ్యర్ధులను నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ, ఈసారి కొన్ని కీలకమైన స్థానాలలో తప్ప మిగిలిన అన్ని చోట్ల బలహీనమైన అభ్యర్ధులను నిలబెట్టడమే అందుకు నిదర్శనమని వారి వాదన. డిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపిని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయెందుకు కూడా సిద్దపడిందని బిజెపి నేతలు వాదిస్తున్నారు. ఈ కారణంగా ఆమాద్మీని ఓడించేందుకు బిజెపి కూడా ఎదురీదవలసి వస్తోంది. 

డిల్లీలో మొత్తం 1.47 కోట్లు మంది ఓటర్లు ఉండగా వారిలో 13 శాతం ముస్లింలున్నారు. సీఏఏను వ్యతిరేకిస్తున్న వారందరూ ఆమాద్మీవైపే మొగ్గుచూపడం ఖాయం. అలాగే డిల్లీలోని పేద, మద్యతరగతి ప్రజలు, యువ ఓటర్లు, బ్రతుకు తెరువు కోసం పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చినవారు ఆమాద్మీవైపే మొగ్గు చూపే అవకాశాలున్నట్లు సర్వేలు సూచిస్తున్నాయి. కానీ ఈసారి బిజెపి తప్పకుండా ఆమాద్మీని ఓడించి అధికారం చేజిక్కించుకొంటుందని బిజెపి నేతలు నమ్మకంగా చెపుతున్నారు. కనుక బిజెపి, ఆమద్మీలలో ఏ పార్టీ గెలుస్తుందో తెలియాలంటే ఈనెల 11న ఫలితాలు వెలువడేవరకు ఎదురుచూడక తప్పదు. 



Related Post