ఎంజీబీఎస్-జెబిఎస్ మద్య మెట్రో సేవలు ప్రారంభం

February 08, 2020


img

ఎంజీబీఎస్-జెబిఎస్ కారిడార్‌లో మెట్రో రైల్‌ సేవలను సిఎం కేసీఆర్‌ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించడంతో శనివారం ఉదయం 6.30 గంటల నుంచి ఆ మార్గంలో మెట్రో రైల్‌ సేవలు ప్రారంభం అయ్యాయి. విశేషమేమిటంటే ఎన్నాళ్ళగానో ఆ కారిడార్‌లో మెట్రో రైళ్ళలో ప్రయాణిస్తున్నట్లు, ఉదయం 6 గంటల నుంచే ఆ మార్గంలో మెట్రో స్టేషన్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడాయి. 

ఎంజీబీఎస్-జెబిఎస్ మద్య కూడా మెట్రో రైల్‌ సేవలు ప్రారంభం కావడంతో నగరంలో మొత్తం 69 కిమీ మేర మెట్రో విస్తరించినట్లయింది. ఎంజీబీఎస్-ఫలక్‌నూమా మద్య మరో 5 కిమీ మెట్రో కారిడార్‌ ఏర్పాటుచేస్తే మొదటిదశ మెట్రో నిర్మాణ కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి. 

మెట్రో ప్రయాణికులు ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవలసి ఉంది. ఎల్బీ నగర్-మియాపూర్ మద్య తిరిగే మెట్రో రైళ్ళు ఈ స్టేషన్లో మొదటి అంతస్తులో ఉన్న ప్లాట్ ఫారంల మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. ఇక ఎంజీబీఎస్-జెబిఎస్ మద్య తిరిగే మెట్రో రైళ్ళు ఈ స్టేషన్లో 2వ అంతస్తులో ఉన్న ప్లాట్ ఫారంల మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. నగరంలో అతిపెద్దదైన ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్‌లో రకరకాల దుకాణాలు వగైరా ఏర్పాటు చేస్తున్నారు. కనుక మెట్రో ప్రయాణికులు తమకు అవసరమైన నిత్యావసర వస్తువుల కోసం మళ్ళీ మార్కెట్‌కు వెళ్ళనవసరం లేకుండా అన్నీ స్టేషన్లోనే కొనుక్కొని ఇళ్ళకు చేరుకోవచ్చు.


Related Post