హైదరాబాద్‌ మెట్రో పట్టాలపై...ఏపీ మెట్రో కాగితాలపై

February 07, 2020


img

ఏపీలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం రాజధాని అమరావతి గ్రాఫిక్స్ చూపిస్తూ 5 ఏళ్ళు కాలక్షేపం చేసేశారు. అలాగే విశాఖ, విజయవాడలో మెట్రో రైల్‌ ఏర్పాటు చేస్తామంటూ సర్వేలు, సమగ్ర నివేదికలతో కాలక్షేపం చేసేశారు. ఈలోగా పుణ్యకాలం కాస్తా పూర్తయిపోవడంతో ఆయన కుర్చీ దిగిపోయారు. ఆ కుర్చీలో కూర్చోన్న జగన్‌మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఏమేమి నిర్ణయాలు తీసుకుందో... ఏమేమి పనులు మొదలుపెట్టిందో వాటన్నిటినీ పక్కన పెట్టడమో లేదా రద్దు చేయడంతోనే 9 నెలలు గడిచిపోయాయి. 

తాజాగా..చంద్రబాబునాయుడు హయాంలో విశాఖ మెట్రో రైల్‌ ప్రాజెక్టు కోసం తయారు చేయించిన సమగ్రనివేదిక (డీపీఆర్)ను పక్కన పడేసి మళ్ళీ కొత్తగా డీపీఆర్ తయారు చేయాలని ఆదేశించారు. ఈమేరకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈసారి డీపీఆర్ కోసం డిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్ లేదా యూఎంటీసీ సంస్థలను సంప్రదించవలసిందిగా ఉత్తర్వులలో పేర్కొంది. మెట్రో కారిడార్‌తో పాటు విశాఖ నగరంలో 60 కిమీ పొడవునా ఆధునిక ట్రామ్ కారిడార్‌ ఏర్పాటుకు గల అవకాశాలను కూడా పరిశీలించి, దానికీ ఓ డీపీఆర్ సిద్దం చేయించాలని ఆ ఉత్తర్వులలో పేర్కొంది. దీంతో విశాఖ మెట్రో మళ్ళీ మొదటికొచ్చింది. 

కనుక మిగిలిన ఈ నాలుగేళ్ళలో మళ్ళీ సర్వేలు, నివేదికలు, అంచనాలు, లెక్కలతో పుణ్యకాలం పూర్తయిపోయినా ఆశ్చర్యం లేదు. ఆ తరువాత మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తే విశాఖ మెట్రో పనులు మొదలవవచ్చు లేదా టిడిపి అధికారంలోకి వస్తే మళ్ళీ ఇవన్నీ పక్కన పడేసి కొత్తగా మొదలుపెట్టాలని నిర్ణయించినా ఆశ్చర్యం లేదు. కనుక ఏపీ ప్రజలు రాజధాని, మెట్రో రైల్‌, పోలవరం ప్రాజెక్టు అన్నిటినీ కాగితాలలో లేదా కంప్యూటర్ గ్రాఫిక్స్ లో చూసుకొంటూ తృప్తి పడకతప్పదేమో?హైదరాబాద్‌ మెట్రో పట్టాలపై పరుగులు తీస్తుంటే ఏపీ మెట్రో మాత్రం కాగితాలపైనే కనబడుతోంది.


Related Post