ఉరిశిక్ష అమలు కోసం కేంద్రం పోరాటం!

February 07, 2020


img

సాధారణంగా ఉరిశిక్ష పడిన ఖైదీలు శిక్ష నుంచి తప్పించుకోవడానికి చివరి నిమిషం వరకు అన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ నిర్భయకేసులో ఉరిశిక్ష పడిన నలుగురు ఖైదీలకు శిక్షను అమలుచేయాలని కోరుతూ కేంద్రప్రభుత్వం, డిల్లీ ప్రభుత్వం, తీహార్ జైలు అధికారులు న్యాయపోరాటం చేయవలసిరావడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. 

గత ఏడేళ్ళుగా ఈ కేసు విచారణ జరుగుతోంది. సుప్రీంకోర్టు నలుగురు దోషులకు ఉరిశిక్ష విధించినప్పటికీ వారు ఇంతకాలం అప్పీలు చేసుకోకుండా, రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టుకోకుండా ఆ అవకాశాలను భద్రంగా దాచుకొని ఇప్పుడు ఉరిశిక్ష తేదీలు ప్రకటించిన తరువాత తమకున్న న్యాయపరమైన ఆ అవకాశాలను తెలివిగా ఉపయోగించుకొంటున్నారు. 

ఒకే కేసులో  ఉరిశిక్షలు పడిన దోషులందరికీ ఒకేసారి ఊరి తీయాలనేది నిబందన. నిర్భయ దోషుల తరపు వాదిస్తున్న న్యావాది ఏపీ సింగ్ సరిగ్గా ఇదే లా పాయింట్ పట్టుకొని వారికి ఉరిశిక్ష అమలుకాకుండా అడ్డుకొంటున్నారు. చట్టంలో ఉన్న ఈ అవకాశం లేదా లొసుగునే ఆయన తెలివిగా ఉపయోగించుకొంటున్నాడని న్యాయస్థానాలు కూడా గ్రహించినా చట్టం వాటి చేతులను కట్టివేయడంతో నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుచేయకుండా పటియాలా కోర్టే స్టే జారీ చేయవలసివచ్చింది. 

దాంతో కేంద్రప్రభుత్వం, డిల్లీ ప్రభుత్వం, తీహార్ జైలు అధికారులు దోషులను వేర్వేరుగా ఉరి తీసేందుకు ఆదేశాలు జారీ చేయాలంటూ న్యాయపోరాటం చేయవలసివస్తోంది. దీనికి సంబందించి కేంద్రప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరిపిన సుప్రీంకోర్టు, తక్షణమే ఉరిశిక్ష అమలుకు ఆదేశాలు జారీచేయలేమని స్పష్టం చేసి, ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. ఇంకా ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో... దోషులకు ఎప్పుడు శిక్ష అమలవుతుందో చూడాలి. 


Related Post