డిల్లీలో మళ్ళీ ఆమాద్మీకే అధికారం?

February 06, 2020


img

ఈనెల 8వ తేదీన డిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. డిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో సిఎం అరవింద్ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమాద్మీ పార్టీయే మళ్ళీ విజయం సాధించబోతోందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. జాతీయపార్టీలైన కాంగ్రెస్‌, బిజెపిలు ఉత్తరాది రాష్ట్రాలలో తమ సత్తా చాటుకొంటున్నప్పటికీ డిల్లీలో మాత్రం వాటి పప్పులు ఉడకటంలేదు. 130 కోట్ల మంది జనాభా ఉన్న భారత్‌ను శాశిస్తున్న ప్రధాని నరేంద్రమోడీకి, అపర చాణక్యుడని పేరొందిన కేంద్రహోంమంత్రి అమిత్ షాలకు డిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్‌ కొరకరాని కొయ్యగా మిగిలారు. 

డిల్లీని 15 ఏళ్ళు ఏకధాటిగా పాలించిన కాంగ్రెస్ పార్టీ కూడా ఆమాద్మీ చేతిలో వరుసగా ఓడిపోతూనే ఉంది. దీనికంతటికీ కారణం అరవింద్ కేజ్రీవాల్‌ ప్రభుత్వం డిల్లీలోని పేదలు, మధ్యతరగతి ప్రజలకు లబ్ది కలిగించే పలు సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టడమేనని సర్వేల్లో తేలింది. వాటికి తోడు ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఏఏపై కూడా డిల్లీ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిజానికి ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని డిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాలే డిల్లీలోని యువతీయువకులను నిరసనలకు ప్రోత్సహిస్తున్నారని, వారికి వెనకనుంచి సహాయసహకారాలు అందజేస్తున్నారని బిజెపి ఆరోపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ సీఏఏ కారణంగా ఈ ఎన్నికలలో బిజెపి నష్టపోవడం, ఆమాద్మీ లాభపడటం ఖాయమని సర్వేలు చెపుతున్నాయి. అరవింద్ కేజ్రీవాల్‌ వరుసగా 2013, 2015 సం.లలో రెండుసార్లు కాంగ్రెస్‌, బిజెపిలను ఓడించారు. ఈసారి కూడా ఓడిస్తే ఇక ఆయనకు...ఆమాద్మీ పార్టీకి ఇక తిరుగు ఉండదు. 


Related Post