మెట్రో ఎండీపై అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం

February 06, 2020


img

హైదరాబాద్‌ మెట్రో యాజమాన్యంపై మజ్లీస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంజీబీఎస్-జెబిఎస్ మద్య అన్ని పనులు పూర్తవడంతో శుక్రవారం మధ్యాహ్నం 4 గంటలకు సిఎం కేసీఆర్‌ ఆ మార్గంలో మెట్రో సర్వీసులను ప్రారంభించబోతున్నారంటూ మెట్రో యాజమాన్యం ట్విట్టర్‌ ద్వారా ప్రజలకు తెలియజేసింది. దానిపై అసదుద్దీన్ ఓవైసీ భిన్నంగా స్పందించడం విశేషం. 

“ఎంజీబీఎస్-జెబిఎస్ కారిడార్‌లో పనులు చేయడానికి మీ వద్ద నిధులు ఉంటాయి కానీ ఎంజీబీఎస్-ఫలక్‌నూమా పనులు ఇంకా ఎప్పుడు మొదలుపెడతారు... ఎప్పుడు పూర్తి చేస్తారు?” అని  ట్విట్టర్‌లోనే ఘాటుగా ప్రశ్నించారు. 


హైదరాబాద్‌ నగరంలో మెట్రో రైల్‌ నిర్మాణానికి ఎల్&టి సంస్థ ప్రభుత్వానికి డిజైన్లు సమర్పించినప్పుడు, మొదట అసదుద్దీన్ ఓవైసీయే అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా ఫలక్‌నూమా వరకు మెట్రో కారిడార్‌లో అనేక చారిత్రిక కట్టడాలున్నాయని కనుక మెట్రో మార్గంలో మార్పులు చేయాలని పట్టుబట్టడంతో ఆ కారిడార్‌ తప్ప మిగిలిన అన్ని కారిడార్‌లలో చురుకుగా పనులు పూర్తి చేసి మెట్రో రైళ్లను నడిపిస్తున్నారు. అప్పుడు ఆయనే అడ్డుకొని ఇప్పుడు మళ్ళీ ఆయనే ఎంజీబీఎస్-ఫలక్‌నూమా వరకు ఎప్పుడు పనులు మొదలుపెడతారు... ఎప్పుడు పూర్తి చేస్తారని నిలదీస్తున్నారు. 

అయినా ఎల్&టి సంస్థ నగరం నలువైపులా చకచకా మెట్రో కారిడార్‌లు నిర్మించి మెట్రో సేవలను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నప్పుడు, ఒక్క ఎంజీబీఎస్-ఫలక్‌నూమా మద్యనే పనులు ఎందుకు చేయలేకపోతోంది?అనే ప్రశ్నకు మెట్రో యాజమాన్యం కాదు... అసదుద్దీన్ ఓవైసీయే సమాధానం చెప్పాలి. పాతబస్తీ మీదుగా మెట్రో ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతంలో ప్రజలందరికీ చాలా సౌకర్యవంతంగా ఉంటుందని తెలిసి ఉన్నప్పుడు మెట్రో నిర్మాణపనులకు ఎవరూ అడ్డుపడకుండా ఆయనే చొరవ తీసుకొని సహకరించాలి. అప్పుడే ఎంజీబీఎస్-ఫలక్‌నూమా పనులు మొదలవుతాయి... మొదలుపెడితేనే పూర్తవుతాయి కదా! 


Related Post