కోమటిరెడ్డి పోరాటం ఫలిస్తుందా?

February 06, 2020


img

హైదరాబాద్‌ శివార్లలో తెలంగాణ ప్రభుత్వం ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఫార్మాసిటీ పేరుతో ప్రభుత్వం పేదరైతుల నుంచి ఎకరాకు రూ.8 లక్షలు చొప్పున కొని కోటిన్నర చొప్పున అమ్ముకొంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి ఫార్మా సిటీ కంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా భారీగా డబ్బు సంపాదించుకోవాలనే యావ ఎక్కువైందని ఆరోపించారు. రైతులకు దక్కవలసిన ప్రయోజనం ఫార్మాసిటీ పేరుతో ప్రభుత్వం దక్కించుకొంటూ పేదరైతులను మోసం చేస్తోందని ఆరోపించారు. కానీ ఆయన ఆరోపణలను పట్టించుకొనేవారే లేకపోవడంతో ఆయన డిల్లీ వెళ్ళి కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి ఫార్మా భూముల కొనుగోలులో జరుగుతున్న అక్రమలావాదేవీల గురించి వివరించి, ఫార్మాసిటీకి అనుమతులు రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ శివార్లలో సుమారు 19,330 ఎకరాలలో రెండు దశలలో ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించి మొదటి దశలో సుమారు 10,000 ఎకరాలలో పనులు మొదలుపెట్టింది. ఆ క్రమంలో వ్యవసాయభూమిని పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా అభివృద్ధి చేసి, దానికి రోడ్లు, కాలువలు, నీళ్ళు, విద్యుత్, మురుగునీటిశుద్ధి ప్లాంట్లు వగైరా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కనుక అన్ని విధాలా అభివృద్ధి చేసిన, అన్ని సౌకర్యాలు కలిగిన భూముల ధరలు పెరగడం సహజమే. పైగా ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఫార్మాసిటీలో భూములను కొనుగోలు చేసి పరిశ్రమలు స్థాపించడానికి పారిశ్రామికవేత్తలు ముందుకువస్తున్నారు కనుక కొంత లాభపడాలని ప్రభుత్వం కోరుకోవడంలో తప్పు లేదు. అయితే ఆ లాభాలలో రైతులకు కూడా కొంతవాటా ఇచ్చి ఉంటే వారికీ న్యాయం చేసినట్లుండేది. 

ఫార్మసిటీలో అన్ని పరిశ్రమలు ఉత్పత్తి కార్యక్రమాలు ప్రారంభిస్తే సుమారు లక్షమందికి పైగా ప్రత్యక్షంగా మరో 50-60,000 మంది పరోక్షంగా ఉపాది పొందే అవకాశం ఉంటుంది. పైగా పరిశ్రమలు ఏర్పాటైతే వాటి నుంచి పన్నుల రూపేణా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు భారీగా ఆదాయం సమకూరుతుంది. కనుక కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మొదలుపెట్టిన ఈ రాజకీయ పోరాటానికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు కూడా పట్టించుకోకపోవచ్చు.


Related Post