సిద్ధిపేటలో ఒకేసారి 24 ఇళ్ళలో గృహాప్రవేశాలు

February 06, 2020


img

సిద్ధిపేట జిల్లా పొన్నాల గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన 24 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళకు రాష్ట్ర ఆర్ధికమంత్రి హరీష్‌రావు బుదవారం ప్రారంభోత్సవం చేశారు. అనంతరం 24 ఇళ్ళలో లబ్దిదారులు ఒకేసారి గృహాప్రవేశాలు చేశారు. మంత్రి హరీష్‌రావు స్వయంగా ప్రతీ ఇంటికీ వెళ్ళి లబ్దిదారులను అభినందించి వారికి మిటాయిలు పంచి వారి ఆతిధ్యాన్ని స్వీకరించారు. 

ఈ సందర్భంగా వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి సొంత ఇల్లు ఏర్పాటుచేయాలనే ఉద్దేశ్యంతో సిఎం కేసీఆర్‌ ఈ పధకాన్ని ప్రారంభించారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా ఒక్కో ఇంటికి రూ.5లక్షలు ఖర్చు చేసి పేదలకు ఉచితంగా ఇళ్ళు అందజేస్తున్నారు. కనుక ఇళ్ళు పొందిన లబ్దిదారులందరూ వాటిని సొంతానికే వినియోగించుకోవాలి తప్ప ఎవరికీ అమ్మడం లేదా తాకట్టు పెట్టడం చేయరాదు. అలా చేస్తే వారిపై కేసులో నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకొంటాము. త్వరలోనే ప్రతీ ఇంటికీ నల్లాలను బిగించి శుద్దమైన మంచినీళ్లు అందిస్తాము. గ్రామస్తుల కోరిక మేరకు పొన్నాల గ్రామంలో మరో 20 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు, అలాగే ముదిరాజ్ కులస్తుల కోసం రూ.3 కోట్లతో ఒక ఫంక్షన్ హాల్ నిర్మిస్తాము. గ్రామంలో దళితుల ఉపాది కోసం బర్రెలు ఇస్తాం. కనుక గ్రామ ప్రజలందరూ ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయసహకారాలను వినియోగించుకొని సుఖంగా జీవించాలని కోరుకొంటున్నాను,” అని మంత్రి హరీష్‌రావు అన్నారు. 

ఈ సందర్భంగా ఆయన గ్రామంలో లబ్దిదారులతో కలిసి ఫోటోలు దిగారు. అలాగే మిగిలిన గ్రామస్తులు కూడా ఆయనతో సెల్ఫీ లు దిగేందుకు పోటీలు పడ్డారు. మంత్రి హరీష్‌రావు ఏమాత్రం విసుక్కోకుండా చాలా ఓపికగా వారందరితో సెల్ఫీ ఫోటోలు దిగారు.


Related Post