హాజీపూర్ సైకో కిల్లర్‌కు నేడు శిక్ష ఖరారు

February 06, 2020


img

హాజీపూర్ గ్రామంలో వరుస హత్యాచారాలకు పాల్పడిన సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డికి ఈరోజు శిక్ష ఖరారుకాబోతోంది. ఈ కేసుల కోసం నల్గొండలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫోక్సో కోర్టు గురువారం మధ్యాహ్నం తుదితీర్పు వెలువరించనుంది.  ఈ కేసులో ఫోక్సో కోర్టు మొత్తం 300 మంది సాక్షులను విచారించి, వారిలో 101 మంది వాంగ్మూలాలు రికార్డు చేసింది. 

యాదాద్రి భువనగిరి జిల్లాలో బొమ్మలరామారం మండలంలోని హాజీపూర్ గ్రామానికి చెందిన శ్రావణి, కల్పనా, మనీషా అనే ముగ్గురు బాలికలను శ్రీనివాస్ రెడ్డి అత్యాచారం చేసిన తరువాత హత్య చేసి గ్రామశివారులోని పాడుబడ్డ బావిలో పూడ్చిపెట్టి, మళ్ళీ గ్రామస్తులకు తనపై అనుమానం కలుగకుండా వారితో కలిసి తప్పిపోయిన బాలికల కోసం చుట్టుపక్కల వెతుకుతున్నట్లు నటించేవాడు. కానీ పోలీసులకు అతని ప్రవర్తనపై అనుమానం వచ్చి నిలదీయగా అసలు విషయం బయటపడింది. 

ఈ కేసులో శ్రీనివాస్ రెడ్డికి తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకొనేందుకు అవకాశం ఇచ్చినప్పుడు తనకు మగతనమే లేదని కనుక అత్యాచారాలు చేశానని ఆరోపించడం సరికాదని, కొందరు గ్రామస్తుల ప్రోత్సాహంతో పోలీసులు తనకు వ్యతిరేకంగా తప్పుడు సాక్ష్యాధారాలు సృష్టించారని వాదించాడు. అయితే తాను నిర్ధోషినని నిరూపించుకోలేకపోవడం, పోలీసులు సమర్పించిన శాస్త్రీయ సాక్షాధారాలన్నీ అతనికి వ్యతిరేకంగా ఉండటంతో న్యాయస్థానం అతనిని దోషిగా నిర్ధారించింది. సమాజానికి ప్రమాదంకరంగా మారిన సైకో కిల్లర్‌ శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్  లాయర్ గట్టిగా వాదించారు. మరికొద్ది సేపటిలో న్యాయస్థానం అతనికి ఏ శిక్ష విధించబోతోందో తెలుస్తుంది.

తాజా సమాచారం: భోజనవిరామం అనంతరం ఈ కేసు విచారణ చేపట్టిన న్యాయమూర్తి మరోసారి శ్రీనివాస్ రెడ్డిని ఏమైనా చెప్పుకోవాలనుకొంటున్నావా? అని ప్రశ్నించగా తాను నిర్ధోషినని చెప్పుకొన్నాడు. కానీ ఈ కేసులో అతను దోషి అని నిరూపించబడిందని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. అయితే అతనికి ఇంకా శిక్ష ఖరారు చేయలేదు. 


Related Post