గులాబీకూలికి ఆదాయపు పన్ను నోటీసులు!

February 05, 2020


img

కూలి పనులలో గులాబీ కూలి వేరని అందరికీ తెలుసు. రోడ్డు పక్కన ఛాయ్ దుకాణంలో ఓ ఛాయ్ అమ్మితే రూ.5 వస్తుంది కానీ దానికే గులాబీరంగు పడితే ఒక ఛాయ్ ఖరీదు రూ.1,000 నుంచి ఎంతైనా పలుకవచ్చు. అలాగే బట్టల దుకాణంలో ఓ మామూలు ‘గులాబీ చీర’ ఖరీదు లక్ష పలుకవచ్చు. అలాగే ‘గులాబీ చీపురు’తో ఆసుపత్రినో కాలేజీనో శుభ్రం చేస్తే లక్ష రూపాయలు ఖర్చు చేయవలసిరావచ్చు. అంటే గులాబీ కూలీ చాలా ఖరీదైన వ్యవహారమన్న మాట! అందుకే ఆదాయపన్ను శాఖ గులాబీకూలీలు...అంటే టిఆర్ఎస్‌ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు,  ఎమ్మెల్సీలకు నోటీసులు పంపించినట్లు తాజా సమాచారం. నోటీసులు అందుకొన్నవారిలో మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు, ఈటల రాజేందర్‌, మహమూద్ అలీ తదితరులున్నారని తెలుస్తోంది. గులాబీ కూలి ద్వారా వారు ఎంత సంపాదించారో, దానిని ఏవిధంగా ఖర్చు చేశారో తెలియజేయాలని కోరుతూ నోటీసులు పంపింది.  

టిఆర్ఎస్‌ ఏటా ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తుంటుంది. దానికి అవసరమైన ఏర్పాట్లు, నిర్వహణ ఖర్చుల కోసం గులాబీ కూలీ పేరిట రాష్ట్రంలోని వ్యాపార, విద్యా, వైద్య తదితర సంస్థల నుంచి విరాళాలు వసూలు చేస్తుంటుంది. అయితే పార్టీ ప్లీనరీ కోసం ప్రైవేట్ సంస్థల నుంచి నేరుగా విరాళాలు సేకరిస్తే ఇటువంటి సమస్యలు వస్తాయి కనుక టిఆర్ఎస్‌ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు,  ఎమ్మెల్సీలు ఏదో ఓ చిన్న పనిచేసి గులాబీ కూలీ పేరుతో దానికి ‘కూలీ డబ్బులు’ తీసుకొంటుంటారు. 

కానీ గులాబీ కూలి పేరుతో తెరాస సర్కార్‌ ప్రైవేట్ సంస్థల నుంచి బలవంతంగా విరాళాలు వసూలు చేస్తోందని ఆరోపిస్తూ2017లో కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి ఆదాయపన్ను శాఖకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన రెండేళ్ళ తరువాత ఆదాయపన్ను శాఖ దానిపై స్పందించి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు,  ఎమ్మెల్సీలకు నోటీసులు జారీ చేయడం విశేషం. 



Related Post