ఆర్టీసీ బస్సులపై ఫోటోలకు కేసీఆర్‌ నో!

February 05, 2020


img

రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, “ఆర్టీసీని లాభాలబాట పట్టించేందుకు సిఎం కేసీఆర్‌ ఎంతగానో కృషి చేస్తున్నారు. అందుకోసం ఆయన తీసుకొంటున్న చర్యలను వివరిస్తూ త్వరలోనే ఆయన ఫోటోలతో కూడిన పోస్టర్లను ఆర్టీసీ కార్గో బస్సులపై ఏర్పాటు చేస్తాము,” అని చెప్పారు. 

కానీ సిఎం కేసీఆర్‌ ఆ ప్రతిపాదనను తిరస్కరించారని సిఎం ప్రత్యేక కార్యదర్శి పి రాజశేఖర్ రెడ్డి తెలియజేశారు. ఈ మేరకు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టరుకు ఒక లేఖ కూడా పంపారు. 

సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ముఖ్యమంత్రి ఫోటోలు అన్నిచోట్లా దర్శనమిస్తుంటాయి కనుక ఆర్టీసీ బస్సులపై కనిపిస్తే పెద్ద విచిత్రమేమీ కాదు. రాజకీయ నేతలు...ముఖ్యంగా అధికార పార్టీ నేతలు ఇంట్లోంచి కాలు బయటపెడితే చాలు.. దారి పొడవునా తమ ఫోటోల కూడిన భారీ ఫ్లెక్సీ బ్యానర్లు ఉండాలని...వాటితో ప్రజలను ఆకట్టుకోవాలని కోరుకొంటారు. కనుక వారి అనుచరులో లేదా వారితో పనులున్నవారో దారి పొడవునా ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటుచేస్తుంటారు. అయితే ఒక నిజమైన నాయకుడు లేదా ప్రజాప్రతినిధి తనపనుల ద్వారా ప్రజల అభిమానం పొందుతాడు తప్ప ఫ్లెక్సీ బ్యానర్ల ద్వారా కాదనే సంగతి వారందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ ప్రజలకు మరిచిపోకుండా గుర్తుచేసేందుకో లేదా తమ గొప్పదనం చాటుకొనేందుకో లేదా ప్రచారయావతోనో ఫ్లెక్సీ బ్యానర్ ప్రదర్శన అలవాటుగా మారిపోయింది. ప్రజలు కూడా దానిని తప్పుగా భావించడం లేదు కనుక రాజకీయ నాయకుల ఫోటోలతో కూడిన బ్యానర్లు దేశమంతటా కనిపిస్తుంటాయి. ఒకవేళ ఆర్టీసీని సిఎం కేసీఆర్‌ నిజంగానే లాభాలబాట పట్టించి కార్మికులకు ఏటా బోనస్ ఇచ్చే స్థాయికి సంస్థను తీసుకువెళ్ళగలిగితే అప్పుడు వారే ఆయనను గుండెల్లో పెట్టుకొని పూజిస్తారు. 


Related Post