టిఆర్ఎస్‌ భయం నిజం కాబోతోందా?

February 04, 2020


img

మునిసిపల్ ఎన్నికలలో కాంగ్రెస్‌, బిజెపిలు సిద్దాంతాలు పక్కనపెట్టి పరస్పరం సహకరించుకొన్నాయని తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో సహా టిఆర్ఎస్‌ నేతలు విమర్శలు గుప్పించారు. వారి ఆరోపణలను ఆ రెండు పార్టీలు ఖండించినప్పటికీ అవి సహకరించుకొన్న సంగతి అందరికీ తెలుసు. అందుకు చాలా బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. 

ఎన్నికలకు ముందు ఆ రెండు పార్టీల అభ్యర్ధులను, ఫలితాలు వెలువడిన తరువాత గెలిచిన అభ్యర్ధులను టిఆర్ఎస్‌ సామదానభేదదండోపాయాలతో లొంగదీసుకోవాలని ప్రయత్నించింది. కనుక ఆ రెండు పార్టీల నేతలు తమ ఉనికిని కాపాడుకోవడం కోసం, తమ రాజకీయ లబ్ది కోసం చేతులు కలపక తప్పని పరిస్థితి టిఆర్ఎస్సే కల్పించిందని చెప్పక తప్పదు. 

టిఆర్ఎస్‌ను కాంగ్రెస్‌, బిజెపిలు ఒంటరిగా ఎదుర్కొలేవని ఇప్పటికే పలుమార్లు రుజువైంది. కానీ లోపాయికారిగా చేతులు కలిపితే టిఆర్ఎస్‌ను ఎదుర్కొని నిలబడవచ్చని మునిసిపల్ ఎన్నికలలో స్పష్టమైంది. ఈవిషయం టిఆర్ఎస్‌తో పాటు ఆ రెండు పార్టీలు కూడా గ్రహించే ఉంటాయి. అయితే కాంగ్రెస్‌, బిజెపిలు ఆ మాట పైకి చెప్పుకోలేవు కనుక టిఆర్ఎస్‌ నేతల ఆరోపణలను ఖండించడంతో సరిపెట్టాయనుకోవచ్చు. 

రాష్ట్రంలో కాంగ్రెస్‌, బిజెపిలు రెండూ తమ ఉనికిని కాపాడుకొంటూ బలపడేందుకు చాలా ప్రయత్నిస్తున్నాయి. అంటే రెండు పార్టీలది ఒకే పరిస్థితిలో ఉన్నాయన్న మాట. అలాగే రెండు పార్టీలు టిఆర్ఎస్‌ వలననే నష్టపోతున్నాయి. అంటే రెంటికీ టిఆర్ఎస్సే ఉమ్మడి శత్రువన్న మాట. కనుక గల్లీస్థాయిలో చేసిన ఈ ప్రయోగంతో కొంత సత్ఫలితాలు వచ్చినందున జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో కూడా రెండు పార్టీలు ఇదేవిధంగా లోపాయికారీగా పరస్పరం సహకరించుకొనే అవకాశాలున్నాయనే భావించవచ్చు. దాంతో అవి టిఆర్ఎస్‌ను ఓడించలేకపోయినప్పటికీ, జీహెచ్‌ఎంసీలో మళ్ళీ చోటు సంపాదించుకోగలుగుతాయి. 

ఒకప్పుడు జీహెచ్‌ఎంసీలో పట్టుమని పది సీట్లు కూడా సంపాదించుకోలేని స్థితిలో ఉండే టిఆర్ఎస్‌, చాలా పట్టుదలగా శ్రమించి జీహెచ్‌ఎంసీపై గులాబీ జెండా ఎగురవేసింది. కనుక జీహెచ్‌ఎంసీపై తన పట్టు నిలుపుకోవాలని కోరుకోవడం సహజమే. అయితే జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్‌, బిజెపిలు లోపాయికారీగా సహకరించుకొంటే టిఆర్ఎస్‌ మళ్ళీ చెమటోడ్చవలసి రావచ్చు. బహుశః అందుకే టిఆర్ఎస్‌ నేతలు వాటి దోస్తీ పట్ల ఆందోళన చెందుతున్నారేమో? కానీ కాంగ్రెస్‌, బిజెపిలు తమ ఉనికిని కాపాడుకొంటూ మళ్ళీ బలపడేందుకు అవసరమైతే లోపాయికారీగా పరస్పరం సహకరించుకోకమానవు. ఎందుకంటే, వాటికి ఇదొక్కటే మార్గం మిగిలి ఉంది కనుక.


Related Post