బిజెపి నేత రఘునందన్ రావుపై అత్యాచారం కేసు నమోదు

February 04, 2020


img

సీనియర్ బిజెపి నేత రఘునందన్ రావుపై రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన గత 12 ఏళ్లుగా తనను అత్యాచారం చేస్తున్నాడని ఓ మహిళా సైబరాబాద్ సిపి సజ్జనార్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన ఆదేశాల మేరకు పోలీసులు రఘునందన్ రావుపై కేసు నమోదు చేశారు. 

రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జ్యోతినగర్‌లో నివాసముంటున్న బాధిత మహిళ సుమారు 17 ఏళ్ళ క్రితం భర్త నుంచి విడిపోయారు. తన పోషణ ఖర్చుల నిమిత్తం భర్తపై సంగారెడ్డి కోర్టులో కేసు వేశారు. ఆ కేసును వాదించేందుకు ఆమె అడ్వకేట్‌గా పనిచేస్తున్న రఘునందన్ రావును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఆ కేసు గురించి మాట్లాడేందుకు అప్పుడప్పుడు ఆమె రఘునందన్ రావు కార్యాలయానికి వెళుతుండేవారు. 

డిసెంబర్ 2007లో ఆయన కార్యాలయానికి వెళ్లినప్పుడు, ఆయన తనకు మత్తుమందు కలిపిన కాఫీ ఇచ్చారని, అది తాగి స్పృహకోల్పోయినప్పుడు తనపై అత్యాచారం చేశారని ఆమె ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులకు ఫిర్యాదు చేసినా లేదా ఆ విషయం ఎవరికైనా చెప్పినా తన నగ్న చిత్రాలను బయటపెడతానని బెదిరిస్తూ గత 12 ఏళ్లుగా రఘునందన్ రావు తనపై అత్యాచారం చేస్తూనే ఉన్నాడని ఆమె చెప్పారు. ఆయనపై తాను అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులతో ఆయనకున్న పరిచయాలను, రాజకీయ పలుకుబడిని ఉపయోగించి కేసు నమోదు కాకుండా అడ్డుకొన్నారని ఆమె ఫిర్యాదు చేశారు. 

చివరికి 2019లో రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు (ఎస్‌ర్‌ 998/2019) చేయగా తక్షణమే రఘునందన్ రావుపై కేసు నమోదు చేయాలని మానవ హక్కుల సంఘం పోలీసులను ఆదేశించిందని కానీ పోలీసులు వారి ఆదేశాలను కూడా పట్టించుకోలేదని ఆమె సిపి సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. 

దాంతో రఘునందన్ రావుపై వెంటనే కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టాలని సిపి సజ్జనార్ ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు పోలీసులు రఘునందన్ రావుపై కేసు నమోదు చేశారు. దీనిని ఆయన ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే వారిపై ఇటువంటి అక్రమకేసులు బనాయించడం దురలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎటువంటి నేరమూ చేయలేదని, ఇది కేవలం రాజకీయ కుట్రే అని అన్నారు. ఈ కేసుకు సంబందించి పూర్తి వివరాలు తెలుసుకొన్న తరువాత స్పందిస్తానని అన్నారు.


Related Post