దిశ ఎన్‌కౌంటర్‌ కేసులో మళ్ళీ కదలిక

February 03, 2020


img

గత ఏడాది నవంబర్ 27న హైదరాబాద్‌ శివార్లలో జరిగిన దిశ హత్యాచారం దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో.. ఆ హేయమైన నేరానికి పాల్పడిన నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్‌ కూడా అంతే సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. దిశ హత్యాచారాన్ని ముక్తకంఠంతో ఖండించిన దేశప్రజలు నిందితుల ఎన్‌కౌంటర్‌ను గట్టిగా సమర్ధించారు. నిందితులు పారిపోయే ప్రయత్నంలో తమపై దాడి చేయగా ఆత్మరక్షణ కోసం కాల్పులు జరుపవలసి వచ్చిందని పోలీసులు చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే నిజమేమిటో అందరికీ తెలుసు.

రాజకీయనాయకులు చెప్పినట్లు చట్టం తనపని తాను చేసుకుపోతోంది. ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు స్పందిస్తూ జస్టిస్ వికాస్ శ్రీధర్ సిర్పుర్కర్, జస్టిస్ రేఖా ప్రకాష్, సిబిఐ మాజీ చీఫ్ కార్తికేయన్‌లతో కూడిన జ్యూడీషియల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సభ్యులు నేడు హైదరాబాద్‌ చేరుకొని హైకోర్టు సీబ్లాకులో విచారణ ప్రక్రియ మొదలుపెట్టారు. అదనపు డీజీ జితేందర్, సిట్ చీఫ్ మహేష్ భగవత్ అక్కడకు చేరుకొని వారికి ఎన్‌కౌంటర్‌కు సంబందించి పూర్తి వివరాలు, పోస్ట్ మార్టం, రీపోస్ట్ మార్టం నివేదికలు వారికి అందజేశారు. 

నేటి నుంచి మూడు రోజులపాటు వారు హైదరాబాద్‌లో ఉండి ఎన్‌కౌంటర్‌పై విచారణ జరుపుతారు. దానిలో భాగంగా దిశ తల్లితండ్రులు, ఆమె సోదరిని, అలాగే ఎన్‌కౌంటర్‌ చేయబడిన నలుగురు నిందితుల కుటుంబసభ్యుల అభిప్రాయాలను రికార్డ్ చేస్తారు. ఆ తరువాత ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులను, వారిపై అధికారులను కూడా ప్రశ్నించి ఎన్‌కౌంటర్‌కు సంబందించి అందరి స్టేట్‌మెంట్స్ రికార్డు చేస్తారు. ఈ ఎన్‌కౌంటర్‌పై వారు నివేదికరూపంలో తమ అభిప్రాయాలను సుప్రీంకోర్టు తెలియజేస్తారు. దాని ఆధారంగా సుప్రీంకోర్టు విచారణ జరిపి తీర్పు చెపుతుంది. 

దిశ కేసులో బాధితురాలు అత్యాచారం చేయబడిన తరువాత హత్య చేయబడింది. ఆమెపై ఈ ఘాతుకానికి పాల్పడిన నలుగురు నిందితులు ఎన్‌కౌంటర్‌లో హతం అయ్యారు. వారిని న్యాయస్థానంలో విచారించి ఉరిశిక్ష విధించినా ఎవరూ వేలెత్తి చూపలేకపోయేవారు. కానీ అనుమానాస్పద పరిస్థితులలో మృతి చెందడంతో వారు (చనిపోయిన తరువాత) బాధితులుగా మారినట్లయింది. దాంతో వారి కుటుంబ సభ్యులు ఇప్పుడు న్యాయం కోసం పోరాడుతున్నారు.  

ఆరోజున నలుగురు నిందితులు పోలీసులపై దాడి చేసి పారిపోవడం నిజమని విచారణ కమిటీ భావిస్తే ఈ కధ ఇక్కడితో ముగుస్తుంది లేకుంటే వారిని ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులు...వారికి ఆ ఆదేశాలు ఇచ్చిన ఉన్నతాధికారులు సుప్రీంకోర్టు బోనులో నిందితులుగా నిలబడవలసి వస్తుంది. కానీ ఆ పరిస్థితి రాదనే ఆశిద్దాం.


Related Post