బడ్జెట్‌పై అప్పుడే పెదవి విరుపులు...

February 01, 2020


img

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రతిపక్షాలు అప్పుడే పెదవి విరుస్తున్నాయి. ఆమె తన రికార్డును తానే బ్రేక్ చేస్తూ ఈసారి సుమారు 3 గంటల పాటు బడ్జెట్‌ ప్రసంగం చేశారు. కానీ ఈ బడ్జెట్‌ దేశాభివృద్ధికి ఏమాత్రం తోడ్పడదని ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి. 

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీ స్పందిస్తూ, “దేశాన్ని పట్టి పీడిస్తున్న నిరుద్యోగ సమస్య పరిష్కారానికి బడ్జెట్‌లో ఎటువంటి నిర్ధిష్టమైన ప్రతిపాదనలు చేయలేదు. దేశాభివృద్ధికి ఏమి చేయాలనే దానిపై ప్రభుత్వానికి ఆలోచనే లేదని ఈ బడ్జెట్‌ స్పష్టం చేస్తోంది. బడ్జెట్‌లో అంతా అయోమయంగా, గతంలో పేర్కొన్న అంశాలనే మళ్ళీ పేర్కొని ‘మమ’ అనిపించేశారు. మోడీ ప్రభుత్వానికి మాటలే తప్ప చేతలు రావని మరోసారి స్పష్టం అయ్యింది,” అని అన్నారు. 

పార్లమెంటులో సీఏఏకు మద్దతుగా ఓటేసిన వైసీపీ ఎంపీలు కూడా బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ వ్యవసాయఆధారిత రాష్ట్రంగా మిగిలిపోయిన ఏపీకి ఏమిస్తారో చెప్పనేలేదు. అలాగే రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి బడ్జెట్‌లో నిధుల ప్రస్తావనే లేదు. ఏపీకి కొత్తగా ఒక్క రైల్వే ప్రాజెక్టు కూడా కేటాయించలేదు. బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని భావిస్తున్నాము,” అని అన్నారు. 

బడ్జెట్‌లో తెలంగాణకు కూడా కొత్తగా ఎటువంటి కేటాయింపులు చేయలేదు. బడ్జెట్‌పై టిఆర్ఎస్‌ ఎంపీలు ఇంకా స్పందించవలసి ఉంది.


Related Post