నిర్భయదోషులు మళ్ళీ తప్పించుకొన్నారు

January 31, 2020


img

నిర్భయదోషులు నలుగురూ మళ్ళీ ఉరిశిక్ష నుంచి తప్పించుకొన్నారు. నలుగురిలో పవన్‌గుప్తా అనే దోషి సుప్రీంకోర్టులో పిటిషన్‌ విచారణలో ఉండగా, మరో దోషి వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్‌ రాష్ట్రపతి వద్ద పెండింగులో ఉంది. జైలు నిబందనల ప్రకారం ఒకే కేసులో ఉరిశిక్ష విధించబడిన దోషులలో ఏ ఒక్కరి పిటిషన్‌ కోర్టులో లేదా రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నా మిగిలినవారిని ఉరితీయడానికి వీలులేదు. దోషుల తరపున వాదిస్తున్న న్యాయవాది ఏపీ సింగ్ ఈరోజు డిల్లీ పటియాలా కోర్టులో ఇదే పాయింటుతో వాదించి మళ్ళీ ఉరిశిక్షను వాయిదా వేయించారు. ఆయన వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి వారి ఉరిశిక్షను తదుపరి ఆదేశాలు వెలువరించే వరకు నిలిపివేయాలని తీహార్ జైలు అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో కొద్ది గంటల ముందు నలుగురు ఉరిశిక్షను తప్పించుకొన్నారు. 

నిజానికి వారిని జనవరి 22న ఉరి తీయాలని ఇదే కోర్టు డెత్ వారెంట్స్ జారీ చేసింది. కానీ దోషులలో ఇద్దరు సుప్రీంకోర్టు క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేసి ఉండటం, ముఖేష్ సింగ్ అనే దోషికి రాష్ట్రపతి క్షమాభిక్ష నిరాకరించిన తరువాత నిబందనల ప్రకారం 14 రోజులు ఉరి తీయకూడదనే నిబందన కారణంగా ఫిబ్రవరి 1న అంటే రేపు తెల్లవారుజామున 6 గంటలకు నలుగురినీ ఒకేసారి ఉరి తీయలంటూ ఇదే కోర్టు మళ్ళీ డెత్ వారెంట్ జారీ చేసింది. 

కానీ వారి ఉరిశిక్షను వీలైనంత ఎక్కువ కాలం వాయిదా వేయించేందుకు వారి న్యాయవాది ఏపీ సింగ్ ఆఖరి నిమిషంలో సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్‌ దాఖలు చేస్తూ, రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్లను వేయిస్తూ చట్టంలో ఉండే అవకాశాలు లేదా లోపాలన్నిటినీ చాలా తెలివిగా ఉపయోగించుకొంటున్నారు. మళ్ళీ ఈరోజు కూడా అదేవిధంగా దోషులకు ఉరిశిక్ష వాయిదా పడేలా చేశారు. 

పటియాలా కోర్టు వారి ఉరిశిక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన కొద్దిసేపటికే వారిలో పవన్ కుమార్ పెట్టుకొన్న పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కానీ మరో దోషి వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్‌ ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగులో ఉంది. కనుక దానిని ఆయన నిరాకరిస్తేతే నలుగురికీ మరో 14 రోజులు గడువు లభిస్తుంది. అప్పుడు మళ్ళీ ఇలాగే 13వ రోజున వారి న్యాయవాది మరొకరి తరపున సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసి ఉరిశిక్షను వాయిదాపడేలా చేస్తారని వేరే చెప్పక్కరలేదు. కనుక ఈ కేసులను అతను ఇంకా ఎంతకాలం సాగదీస్తారో చూడాలి. 

పటియాలా కోర్టు తీర్పుపై నిర్భయ తల్లి ఆశాదేవి స్పందిస్తూ, “మన న్యాయస్థానాలు దోషుల హక్కుల గురించి ఆలోచించినంతగా బాధితుల హక్కుల గురించి, వారికి జరిగిన అన్యాయం గురించి ఆలోచించడం లేదనిపిస్తోంది. దోషుల తరపున వాదిస్తున్న న్యాయవాది ఏపీ సింగ్ వారికి ఎన్నటికీ ఉరిశిక్ష పడకుండా అడ్డుకొంటానని మాతో సవాలు చేశారు. అయితే మా కుమార్తెకు అన్యాయం చేసినవారికి శిక్షపడేవరకు మేమూ పోరాడుతూనే ఉంటాము,” అని అన్నారు. 


Related Post