కేసీఆర్‌ నుంచి జగన్ ఏమి నేర్చుకొన్నారో?

January 31, 2020


img

తెలంగాణ సిఎం కేసీఆర్‌ ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డికి అవసరమైనప్పుడు సాయం చేశారు. సలహాలు, సూచనలు ఇస్తూనే ఉన్నారు. వాటిలో కొన్నిటిని జగన్ పాటించినట్లు కనిపిస్తోంది. ఆ కారణంగా రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా నిలిచి ఉన్న టిడిపిని మట్టికరిపించగలిగారు. నేటికీ..కోలుకోలేనివిధంగా దానిని దెబ్బదెబ్బ మీద దెబ్బ తీస్తునే ఉన్నారు. అయితే సంక్షేమపధకాలు, వివిద వర్గాలకు వరాల ప్రకటనలో జగన్ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. దేశంలో చాలా రాష్ట్రాల కంటే ఆర్ధికంగా బలంగా ఉన్న తెలంగాణ రాష్ట్రమే సంక్షేమ పధకాల అమలులో ఆచితూచి అడుగులు వేస్తుంటే, నెలవారి ఖర్చులకు తడుముకొంటున్న జగన్ సర్కార్ ఇన్ని వరాలు, సంక్షేమ పధకాలు ప్రకటిస్తుండటం చూసి ‘వాటన్నిటికీ ఎక్కడి నుంచి డబ్బు తెస్తారు?’ అని ప్రజలే ప్రశ్నిస్తున్నారు. 

అయితే జగన్ అధికారంలోకి రాగానే వరుసగా ప్రకటిస్తున్న ఈ వరాలు, సంక్షేమ పధకాలను, 4-5 నెలల వ్యవధిలోనే లక్షలాదిమంది సచివాలయ ఉద్యోగులను భర్తీ చేయడం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వంటివన్నీ చూసి తెలంగాణ కొన్ని పార్టీలు ‘జగన్ చూసి నేర్చుకోమని’ సిఎం కేసీఆర్‌ను ఎద్దేవా చేశాయి. కానీ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి పూర్తి అవగాహన ఉన్న కేసీఆర్‌ మాత్రం ఏమాత్రం తొందరపడలేదు. పైగా పంటరుణాల మాఫీ, నిరుద్యోగ భృతి వంటి కొన్ని హామీలను పెండింగులో పెట్టారు కూడా. అందుకే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికంగా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటునప్పటికీ అన్ని కార్యక్రమాలు, పధకాలు యాధావిధిగా సాఫీగా సాగిపోతున్నాయి. 

కానీ జగన్ ప్రకటించిన వరాలు, తీసుకొన్న నిర్ణయాలే ఇప్పుడు ఏపీ సర్కారుకు గుదిబండగా మారినట్లు కనిపిస్తున్నాయి. కనుక వాటిని కొనసాగించాలంటే ప్రజలపై అదనపు భారం మోపకతప్పదు. ప్రజలకు వరాలు ప్రకటించకపోయినా ఏమీ అనుకోరని మునిసిపల్ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. కానీ వాటి కోసం ప్రజలపై అదనపు భారం మోపాలనుకొంటే మాత్రం తప్పకుండా అసంతృప్తి చెందుతారని అనేకసార్లు రుజువైంది. కనుక సంక్షేమ పధకాల విషయంలో కేసీఆర్‌ వైఖరే సరైనదని అర్ధమవుతోంది. 

రాజధానిని విశాఖకు తరలించడం, మూడు రాజధానుల ఏర్పాటు, శాసనమండలిని రద్దు వంటి నిర్ణయాలతో ప్రస్తుతం  ఏపీలో ఏదో ఇదని చెప్పలేని ఓ అనిశ్చిత వాతావరణం నెలకొంది. ఇవి ప్రభుత్వ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. ఏపీలో రియల్ ఎస్టేట్, పరిశ్రమలు, ఐ‌టి రంగాలు తీవ్ర ఒడిదుకులకు లోనవుతున్నాయి. కేసీఆర్‌ సర్కారును ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుతున్నప్పుడు జగన్ సర్కార్ కూడా చాలా ఆచితూచి అడుగులు వేస్తుందని ప్రజలు ఆశిస్తారు. కానీ అందుకు భిన్నంగా సాగుతూ సమస్యలను కొని తెచ్చుకొంటుండటంతో ఇప్పుడు తెలంగాణ పార్టీలు కూడా ‘జగన్‌ను చూసి నేర్చుకోమని’ కేసీఆర్‌కు సలహా చెప్పడం మానుకొన్నాయి.


Related Post