ఉత్తమ్‌కుమార్ ఇక ఇంట్లో కూర్చోంటే మంచిది: కేటీఆర్‌

January 31, 2020


img

మునిసిపల్ ఎన్నికలలో గెలిచిన టిఆర్ఎస్‌ కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గురువారం తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు. ఎన్నికలలో గెలిచి పదవులు పొందినవారందరూ అహంభావంతో విర్రవీగకుండా కొత్త మునిసిపల్ చట్టంలో తమ అధికారాలు, బాధ్యతల గురించి అవగాహన ఏర్పరచుకొని ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలని హితవు పలికారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ.. దాని అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశ్యించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

“గతంలో మన పార్టీ ఎన్నికలలో గెలిస్తే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి గెలిచామని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించేవారు. ఈసారి మునిసిపల్ ఎన్నికలలో బ్యాలెట్ పేపర్లతో గెలిస్తే అధికార దుర్వినియోగానికి పాల్పడి గెలిచామని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఆయనకు వ్యవస్థలపై నమ్మకం పోయిందని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీపై నమ్మకం పోయింది. కనుక ఇకపై ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి ఇంట్లో కూర్చోంటే మంచిదేమో?2014 నుంచి జరుగుతున్న ప్రతీ ఎన్నికలలో టిఆర్ఎస్‌ వరుస విజయాలు సాధిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ ప్రతీ ఎన్నికలలోను ఓడిపోతోంది. ఓడిపోయిన ప్రతీసారి ఇటువంటి అసత్య ఆరోపణలు చేసి తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం ఉత్తమ్‌కుమార్ రెడ్డికి అలవాటుగా మారింది,” అని అన్నారు.

 కేటీఆర్‌ చెప్పినట్లు 2014 నుంచి జరుగుతున్న ప్రతీ ఎన్నికలలో టిఆర్ఎస్‌ గెలుస్తుండటం, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుండటం వాస్తవం. కానీ అంతమాత్రన్న కాంగ్రెస్‌పై ప్రజలు నమ్మకం కోల్పోయారనుకోలేము. ఫిరాయింపులతో కాంగ్రెస్‌ పార్టీని టిఆర్ఎస్‌ ఎంత బలహీనపరిచినప్పటికీ నేటికీ అది ప్రతీ ఎన్నికలలోనూ 2వ స్థానంలో నిలుస్తోంది. ఒకవేళ  ప్రజలకు కాంగ్రెస్‌పై ఇంకా అభిమానం లేకుంటే టిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయమని చెప్పుకొంటున్న బిజెపి 2వ స్థానంలో ఉండేది కదా?కర్ణుడి చావుకు వేయి శాపాలు..కారణాలు అన్నట్లు ప్రతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కూడా అనేక కారణాలున్నాయి. అవన్నీ కాంగ్రెస్ నేతలు, ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ సమస్యలను, సవాళ్లను అధిగమించలేకపోవడం చేతనే ప్రతీ ఎన్నికలలోను ఓడిపోతోంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలనాటికి కూడా ఈ సమస్యలను, సవాళ్లను అధిగమించలేకపోతే కేటీఆర్‌ చెప్పినట్లు అప్పుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇంట్లో కూర్చోక తప్పదు. ఇప్పటికే జానారెడ్డివంటివారు ఇంట్లో కూర్చోంటున్నారు అప్పుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డితో సహా కాంగ్రెస్‌ నేతలందరూ ఇంట్లో కూర్చోక తప్పదు.


Related Post